కాళోజీ కళాక్షేత్రం కలగా మిగిలే.. !

by Shyam |
కాళోజీ కళాక్షేత్రం కలగా మిగిలే.. !
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ప్రజాకవి కాళోజీ నారాయ‌ణ‌రావు క‌‌ళాక్షేత్ర భ‌వ‌న నిర్మాణ పనులు నత్తనడకన సాగుతోంది. హన్మకొండ బాల‌స‌ముద్రంలోని హ‌యాగ్రీవాచారి గ్రౌండ్‌లో సీఎం చేతుల మీదుగా 2014 సెప్టెంబరు 9న శంకుస్థాప‌న జ‌రిగిన ఈ నిర్మాణానికి అతిగతి లేకుండా పోయింది. రూ.50 కోట్ల అంచ‌నా వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలుగా మారాయి. ఆరున్నరేళ్లు గడిచినా కనీసం మొదటి దశ నిర్మాణ పనులు కూడా కొలిక్కి రాలేదు. కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న సంస్థకు స‌కాలంలో బిల్లుల మొత్తాన్ని చెల్లించ‌క‌పోవ‌డంతో ప‌నుల‌ను అర్ధాంత‌రంగా నిలిపివేసింది. అసలు సంవత్సరన్నకాలంగా పనులే జరగడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క‌ళాక్షేత్రం అందుబాటులోకి వ‌స్తే స‌భ‌లు, స‌మావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉందనుకున్న సాహితీలోకానికి నిరాశే మిగులుతోంది.

ప్రభుత్వం ఇలా చేస్తామని చెప్పింది..

4.5 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. నిర్మాణానికి రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తులుగా (జీప్లస్​ 4) భవన నిర్మాణం జరగాల్సి ఉంది. మూడు ద‌శ‌ల్లో రెండేళ్లలో నిర్మాణం కంప్లీట్​ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ ప‌నుల్లో భాగంగా భవనం సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ పనులు, మూడో దశలో ల్యాండ్‌ స్కేపింగ్‌, పాథ్‌ వే, పార్కింగ్‌ ఇతరత్రా పనులు పూర్తి చేయాల‌ని ప్రణాళిక రచన చేసింది. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ల్లో ఆర్ట్‌ గ్యాలరీ, ఆడిటోరియం, రిహార్సల్​ రూం, గ్రీన్‌ రూం, లాబీ, మొదటి అంతస్తులో ఆర్టియం, ప్రీ ఫంక్షన్‌ ఏరియా, ఆఫీసు గదులు, ఫుడ్‌ కౌంటర్‌, స్టోర్‌ రూమ్స్‌, వాష్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసేలా ప్లాన్‌ రూపొందించారు. రెండో అంతస్తులో గ్రంథాలయం, ఆఫీసు, స్టోర్స్‌, లాబీ, వాష్‌ రూములు, మూడు, నాలుగో అంతస్తుల్లో ప్రీ ఫంక్షన్‌ లాబీ, బాల్కనీ, టెర్రస్‌, క్యాట్‌వాక్‌ లాబీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

నిధుల మంజూరు లేకే…

ఆరున్నరేళ్లుగా ప‌నులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు అంత‌స్తుల భ‌వ‌న రూప‌కం తీసుకొచ్చారు. నాలుగో అంత‌స్తు నిర్మాణం జ‌ర‌గాల్సి ఉంది. అంటే మొద‌టి ద‌శ ప‌నులే పూర్తి కాలేదు. ఇప్పటికిప్పుడు ప‌నులు పునః ప్రారంభించినా ఇంటీరియ‌ల్‌తో పాటు మిగిలిన ప‌నులు పూర్తి చేయ‌డానికి ఏడాదిన్నర ప‌డుతుంద‌ని ఇంజినీరింగ్ అధికారులు ఆఫ్ ది రికార్డుల్లో పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే పనులు ముందుకు సాగడం లేదని పేర్కొంటున్నారు. రూ.30 కోట్ల వ‌ర‌కు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ త‌ర్వాత చేతులెత్తేసింది. దీంతో పనులు ద‌క్కించుకున్న మెస్సర్స్‌ సిర్కో సంస్థ ప‌నుల‌ను నిలిపేసింది. నిజానికి ఈ సంస్థ స్థానిక కాంట్రాక్టర్‌కు సబ్‌ కాంట్రాక్టుగా అప్పగించింది. వారి ఆధ్వర్యంలో దాదాపు రూ. 10 కోట్ల పైగా పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ప‌నులు కొనసాగించలేక నిలిపేసింది. కాగా, మొత్తం ప‌నుల‌కు మొదట అనుకున్న అంచనా కన్నా మ‌రో రూ.పది కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed