ఒక్క తట్ట మట్టి ఎత్తలే..

by Shyam |
ఒక్క తట్ట మట్టి ఎత్తలే..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : అదో ఆధునిక దేవాలయం.. రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని. ఒక్కమాటలో చెప్పాలంటే.. సాక్షాత్తూ అన్నపూర్ణగా ఏపీ, తెలంగాణ రైతాంగం భావిస్తుంటారు. అదే నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఇటు తెలంగాణలోనూ.. అటు ఏపీలోనూ లక్షలాది ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. అంతటి మహోన్నతమైన బహుళార్థసాధక ప్రాజెక్టు.. తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన కాలం నుంచి నేటి కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పాలన వరకు అదే నిర్లక్ష్యం ప్రాజెక్టును వెంటాడుతోంది. కోట్లాది మంది కడుపు నింపేందుకు ఆధారమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఏటేటా పూడిక పేరుకుపోతోంది. ఏటికేడు ప్రమాదకరంగా మారుతున్న పూడికపై మేధావులు, నిపుణులు, రైతులు నెత్తినోరు కొట్టుకుంటున్నా.. పాలకులు కనీసం పెడచెవిన పెట్టడం లేదు. దాదాపు 408 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన సాగర్ ప్రాజెక్టు.. నేడు 312 టీఎంసీల నీటి నిల్వకే పరిమితం అయ్యిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీలోనూ ఇంతకుమించి పూడిక పేరుకుపోయింది. ఏటాటా నాగార్జునసాగర్‌, మూసీ ప్రాజెక్టుల్లో పేరుకుపోతున్న పూడికపై దిశ ప్రత్యేక కథనం.

సాగర్‌లో 110 టీఎంసీలకు పైగా తగ్గిన నీటినిల్వ..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 10 డిసెంబరు, 1955న శంకుస్థాపన చేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత 1967 సంవత్సరంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 408.24 టీఎంసీలు. అయితే గత 53 ఏళ్లలో దాదాపు 110 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 298 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటోంది. ఒక్కసారి జల సాంకేతిక నిపుణుల సర్వే అంచనా ప్రకారం పూడికను పరిశీలిస్తే.. 1967 సంవత్సరం నుంచి 1974 వరకు 14.4 టీఎంసీల నీటి నిల్వను పూడిక వల్ల సాగర్ ప్రాజెక్టు కోల్పోయింది. 1978 సంవత్సరం నాటికి 48.7 టీఎంసీలు, 2009 అక్టోబరులో వచ్చిన ఆకస్మిక వరదకు ప్రాజెక్టులోకి బురద భారీగా వచ్చి చేరింది. దీనివల్ల సాగర్ ప్రాజెక్టులోకి 2010 నాటికి 96.05 టీఎంసీలు, 2016 సంవత్సరం నాటికి 108 టీఎంసీలు, 2020 నాటికి 110 టీఎంసీల కంటే ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఐదేండ్లలో సగానికి పైగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

అసలు ఎందుకు పూడుతుందంటే..

సుదీర్ఘ పొడవు ఉన్న కృష్ణానదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉండడం.. మరోవైపు నల్లమల అడవులు, గుట్టలు అధికంగా ఉండడం వల్ల వరదతో పాటు ఒండ్రు మట్టి, రాళ్లురప్పలు, చెట్టుచేమ భారీగా నదిలోకి వచ్చి మేటలు వేస్తోంది. 2,58,948 చదరపు కిలోమీటర్ల మేర కృష్ణానది విస్తీర్ణం ఉంటే.. 110 చదరపు మైళ్ల పరిధిలో ఐదు జిల్లాల్లో విస్తరించి ఉంది. అటవీ ప్రాంతం ఉండడం.. గుట్టల నుంచి వరద అధికంగా రావడం.. జంతువులు నీరు తాగేందుకు నదిలోకి వచ్చే సమయంలో రాళ్లు పడడం వంటి కారణాలతో నది ప్రవాహాంలో ప్రాజెక్టులోకి రాళ్లు కొట్టుకొస్తున్నాయి. ఏటేటా పెద్ద ఎత్తున పేరుకుపోతున్న పూడికను తీయడం కంటే.. ప్రాజెక్టులోకి పూడిక రాకుండా చూసుకోవడం ఉత్తమమార్గం. అందులో భాగంగానే సాగర్ జలాశయాని కంటే ముందుగానే చిన్న ప్రాజెక్టులను నిర్మిస్తే కొంతమేర ఉపయోగం ఉంటుంది. గుట్టలు, అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదలతో పాటు రాళ్లు, మట్టి తదితరాలను నివారించేందుకు రాయితో కట్టడాలు చేపట్టాలి. జలాశయంలో నీరు తగ్గిన సమయంలో ప్రాజెక్టు తీరాల్లోని ఒండ్రు మట్టిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో తీసి ఆయకట్టేతర ప్రాంతాల్లోని మెట్ట భూములకు తరలిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మూసీ ప్రాజెక్టులో పరిస్థితి ఇదీ..

నాగార్జునసాగర్ తర్వాత జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ మొదటి నుంచి నిర్లక్ష్యానికి గురవుతూనే వస్తోంది. మూసీ ప్రాజెక్టును దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించారు. 645 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న మూసీ రిజర్వాయర్ కింద 41వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ మూసీ ప్రాజెక్టులో విపరీతమైన పూడిక వల్ల దాదాపు 5 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. అయితే మూసీ ప్రాజెక్టులోని పూడికను బయటకు పోయేలా అప్పటి ఇంజినీర్లు ప్రాజెక్టుకు స్కవర్ గేట్ల వ్యవస్థను రూపొందించారు. ఇది ఈ వ్యవస్థ ఇప్పటికీ ఒకట్రెండు ప్రాజెక్టుల్లోనే అమలు చేశారు. అయితే పాలకుల నిర్లక్ష్యం వల్ల స్కవర్ గేట్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రాజెక్టులో పూడికతీత భారీగా పేరుకుపోయింది. 1996 సంవత్సరంలో నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆధారంగా మూసీ జలాశయంలో 10 అడుగుల మేర పూడిక పేరుకున్నట్టు గుర్తించారు. ఈ పూడికను తొలగించేందుకు అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదికలు పంపిగా.. పలుమార్లు నిధులు కేటాయించి విడుదల చేయకుండానే మొండిచేయి చూపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ అదే నిర్లక్ష్యం చూపడంతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

పేరుకుపోయిన పూడిక..

జిల్లాలోని నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టులో ఏండ్ల తరబడిగా పేరుకుపోయిన పూడికను ఉమ్మడి పాలనలో గానీ ప్రత్యేక రాష్ట్రంలో గానీ తట్టెడు మట్టి తీయలేదంటే అతిశయోక్తి కాదు. మండు వేసవిలో ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోయిన సందర్భంలోనూ ప్రాజెక్టుల్లో పూడికను తొలగించలేదు. దీంతో ఏటేటా సాగర్, మూసీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి ఎటూ లేదన్నా.. 120 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే ఐదేండ్లలో సగానికి పైగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అయితే పూడిక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా పూడిక నివారణకు చర్యలు తీసుకోకపోతే.. ఆయకట్టు ప్రాంతం భవిష్యత్తులో ఏడారిలా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సాగర్‌లో తగ్గిన నీటినిల్వ స్థాయి ఇలా..
సంవత్సరం తగ్గిన నీరు (టీఎంసీల్లో)
1967-74 14.4
1974-78 48.7
1978-2009 79.21
2009-2010 96.05
2010-2016 108
2016-2020 110

Advertisement

Next Story

Most Viewed