NDSA రిపోర్టులో సంచలన విషయాలు.. DPRకు విరుద్ధంగా బ్యారేజీల నిర్మాణాలు

by Shiva |
NDSA రిపోర్టులో సంచలన విషయాలు.. DPRకు విరుద్ధంగా బ్యారేజీల నిర్మాణాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాంతాలను పక్కన పెట్టి, మరోచోట మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజీలను నిర్మించారు. దీంతో ఆయా బ్యారేజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఈ మధ్య ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఎవరు చెబితే డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాంతం నుంచి మరోచోట బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొత్త ప్రాంతాల్లో బ్యారేజీలు కట్టేముందు కనీసం జియోలజికల్, జియో టెక్నికల్ టీమ్స్ తో అక్కడ ఎలాంటి భూ పరీక్షలు నిర్వహించలేదని రిపోర్టులో పేర్కొన్నారు.

ఇష్టం ఉన్న చోట నిర్మాణాలు

బ్యారేజీలను నిర్మించే ముందు నదిలో ఎక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుందనే అంశంపై అన్ని రకాలుగా పరిశోధనలు చేసిన తరువాతే సాంకేతిక నిపుణులు నిర్ణయం తీసుకుంటారు. కానీ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం విషయంలో అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నది. దీనితో డీపీఆర్ లో పేర్కొన్న ప్రాంతాల్లో కాకుండా తమకు ఇష్టం ఉన్న చోట బ్యారేజీలను నిర్మించారని విషయం ఈ మధ్య నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుల్లో వెల్లడైంది.

అన్నారం బ్యారేజీని డీపీఆర్ లో పేర్కొన్న ప్రాంతంలో కాకుండా 2.2 కిలో మీటర్ల కింద నిర్మించారు. నది ప్రవాహం అధికంగా ఉంటే చోటుకు షిఫ్ట్ చేశారు. దీనితో బ్యారేజీలో నీటి నిలువ సామార్ధ్యం 11.81 టీఎంసీల నుంచి 13.56 టీఎంసీలకు పెరిగింది. అలాగే సుందిళ్ల బ్యారేజీని కూడా 5.40 కిలో మీటర్ల కింద నిర్మించారు. దీనితో బ్యారేజీ పొడవు ఒక మీటర్ తగ్గింది. నీటి నిలువ సామార్ధ్యం 3.27 టీఎంసీలకు పెరిగింది. డీపీఆర్ లో పేర్కొన్న ప్రాంతాల్లో కాకుండా ఇతర చోట నిర్మాణాలు చేయడం వల్లే ఆ రెండు బ్యారేజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని అభిప్రాయానికి ఎన్డీఎస్ఏ అభిప్రాయపడింది.

ఎవరు చెబితే ప్రాంతాన్ని మార్చారు?

డీపీఆర్ లో పేర్కొన్న ప్రాంతంలో కాకుండా మరోచోట ఆ రెండు బ్యారేజీలను నిర్మించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఇంజనీర్లే సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? లేకపోతే ఎవరైన చెబితే బ్యారేజీలను నిర్మించారా? అనే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. అయితే ఎన్.డీ.ఎస్.ఏ రిపోర్టులో ‘‘ఓ మీటింగ్ లో బ్యారేజీ నిర్మాణ ప్రాంతాలను మార్చాలి’’ అని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ మీటింగ్ లో ఎవరు తుది నిర్ణయం తీసుకున్నారోనని విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ డీపీఆర్ లో పేర్కొన్న ప్రాంతంలో కాకుండా మరోచోట బ్యారేజీ కట్టాలంటే ఆ ప్రాంతంలో జియోలజికల్, జియో టెక్నికల్ టీమ్స్ ను సంప్రదించాలి. వారిచ్చే రిపోర్టుల ఆధారంగా అక్కడ పనులు మొదలుపెట్టాలి. కానీ, ఎవరిని సంప్రదించకుండానే ప్రస్తుత ప్రాంతాల్లో పనులు చేపట్టినట్లు ఎన్.డీ.ఎస్.ఏ వెల్లడించింది.



Next Story

Most Viewed