కేసీఆర్ వ్యూహం.. బీజేపీకి తీరని డ్యామేజ్.. అమిత్ షా ఏం చేయనున్నారు..?

by Anukaran |
KCR BJP
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు పది రోజుల పాటు ఢిల్లీలో గడపడం, ప్రధాని సహా పలువురు మంత్రులతో వరుస భేటీలు రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చకు దారితీసింది. బీజేపీ, టీఆర్ఎస్ దోస్తులేననే సంకేతం రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్న అమిత్ షా ఈ సందేహాలను నివృత్తి చేసే విధంగా ప్రసంగించవచ్చని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తెలంగాణ బీజేపీ వర్గాలను నిరుత్సాహానికి గురిచేసిన నేపథ్యంలో అమిత్ షా నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్‌తో బీజేపీకి ఎలాంటి దోస్తానా లేదని, రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం బలమైన ప్రత్యర్థిగానే ఉంటుందనే మెసేజ్‌ను ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి పంపాలనుకుంటున్నట్లు తెలిసింది.

ప్రధానితో, పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కావడం, హుజూరాబాద్ ఉప ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడడం టీఆర్ఎస్‌కు బాగా లాభించిందనే చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. కేసీఆర్ ఒత్తిడి మేరకే హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూలు వెలువడలేదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో గట్టిగా కొట్లాడుతున్నా ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలు మాత్రం స్నేహంగా ఉండడం, రాష్ట్ర పథకాలపై కేంద్ర మంత్రులు ప్రశంసలు గుప్పించడం రాష్ట్ర కమలనాధులకు మింగుడుపడడంలేదు. గట్టిగా కొట్లాడి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి, ప్రజల్లో స్పష్టమైన సందేశాన్ని పంపినా కేసీఆర్‌తో మర్యాదపూర్వక భేటీలు నీరుగారుస్తున్నాయని రాష్ట్ర బీజేపీ నేతలు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా కేసీఆర్‌‌తో జరిగిన మీటింగులను ప్రస్తావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 17న నిర్మల్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్‌పైన అమిత్ షా ఘాటుగానే విరుచుకుపడే అవకాశం ఉందని, రెండు పార్టీల మధ్య రాజకీయ వైరమే ఉందని, ఎలాంటి స్నేహం లేదనే అభిప్రాయం కలిగే విధంగా సూటి విమర్శలు చేసే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు గట్టిగా చెప్తున్నారు. ఢిల్లీలో కేసీఆర్ తాజా పర్యటనతో బీజేపీకి రాష్ట్రంలో జరిగిన డ్యామేజీని కవర్ చేసుకునే విధంగా అమిత్ షా నిర్మల్ పర్యటన ‘డ్యామేజ్ కంట్రోల్’ తీరులో ఉంటుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదనే మెసేజ్‌ను ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed