టీఆర్ఎస్‌పై దండయాత్ర.. లక్ష మందితో కాంగ్రెస్ భారీ ప్లాన్

by Anukaran |
టీఆర్ఎస్‌పై దండయాత్ర.. లక్ష మందితో కాంగ్రెస్ భారీ ప్లాన్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ కొత్త రథ సారథి నాయకత్వంలో దూకుడు ప్రదర్శిస్తోంది.. క్యాడరు, లీడర్లలో నయా జోష్, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. పోరుగడ్డ ఇంద్రవెల్లి వేదికగా ఈ నెల 9న నిర్వహించే దళిత దండోరాకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షమందిని సమీకరించేందుకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పార్టీలో చేరికలు ప్రారంభమవటంతో మళ్లీ పూర్వ వైభవం వస్తుందా.. లేదా.. అనే చర్చ సాగుతోంది.. గతానికి భిన్నంగా కొత్త సారథి రేవంత్ ‌రెడ్డి నాయకత్వంలో బలోపేతం అవుతుందని.. మళ్లీ పార్టీలోకి వలసలు పెరగటమే శుభ పరిణామమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

వరుస ఓటములు.. కీలక నేతల వలసలు.. నడిపించే నాయకత్వం లేక.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయక.. రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారిపోగా.. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఎ.రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీలో పలు మార్పులు, కీలక పరిణామాలు వచ్చాయి. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా నిర్మల్ వేదికగా ఎడ్లబండ్లు, సైకిళ్లతో మహాధర్నా నిర్వహించగా విజయవంతం కావటంతో.. ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. నాయకుల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆగస్టు 9న లక్షమంది దళిత, గిరిజనులతో దళిత దండోరా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

ఇప్పటికే ఈ సభ నిర్వహణ, నాయకత్వ బాధ్యతలు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేం సాగర్ రావుకు అప్పగించగా.. ములుగు ఎమ్మెల్యే సీతక్క, కేపీఆర్ ఏర్పాట్లను పరిశీలించారు. దళిత దండోరా పోస్టర్లను కూడా టీపీసీసీ అధ్యక్షుడు, ఇతర నాయకులు ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి జనాన్ని సమీకరిస్తుండగా.. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులకు ఈ బాధ్యతలు ఇవ్వగా.. సభను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇంద్రవెల్లి వేదికగా కొమరం భీం స్ఫూర్తితో నిర్వహిస్తున్నామని.. పోరాటాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నామని టీపీసీసీ పేర్కొంటోంది.

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడింది. కొత్త రథ సారథి వచ్చాక అనూహ్య మార్పులు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు పార్టీ నుంచి కీలక నాయకులు బయటకు వెళ్లగా.. తాజాగా మళ్లీ కాంగ్రెసులోకి వలసలు మొదలు కావటం శుభ పరిణామమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పిసా చట్టం జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న వెడ్మా బొజ్జా పదవికి రాజీనామా చేసి.. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడార్ల గంగ నర్సయ్య స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తీరుకు నిరసనగా పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలు కావటంతో.. మళ్లీ ఆ పార్టీ పూర్వ వైభవం వస్తుందనే ఆశ కార్యకర్తల్లో చిగురిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed