ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల బెదిరింపులు.. ఏదో ఒకటి ఇవ్వాలంటూ..

by Shyam |
customs
X

దిశ, శంషాబాద్: విదేశాలనుండి స్వదేశానికి వచ్చిన ప్రయాణికుడికి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులతో చేదు అనుభవం ఎదురైన ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం షార్జా నుండి ఈ నెల 16 వ తేదీన ఇండిగో (6E-1406) విమానంలో స్వదేశానికి వచ్చిన అతన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బెదిరించి డబ్బులు, మద్యం బాటిల్ డిమాండ్ చేశారని బాధితుడు శ్రీనివాసరావు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా గోపవరానికి చెందిన ఓగురి శ్రీనివాసరావు( ఇంజనీర్) షార్జా నుండి ఇండిగో ఎయిర్ లైన్స్ లో స్వదేశానికి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన శ్రీనివాసరావు అతని సామాగ్రిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దీంతో కస్టమ్స్ అధికారులు డబ్బులు ఇవ్వాలని అడగడంతో దీనికి ప్రయాణికుడు నిరాకరించాడు. కస్టమ్స్ విభాగంలోని ఐదుగురు ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించి అవమానకరంగా మాట్లాడారు.

ప్రయాణికుడు తెచ్చుకున్న లగేజీలో ఉన్న లిక్కర్ బాటిల్ అయిన ఇవ్వాలని బెదిరించారు. ఇవ్వననడంతో గదిలోకి తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేశారు. విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న కస్టమ్స్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును ఎయిర్‌పోర్ట్ లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కు పార్వడ్ చేశామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed