పోటీ పరీక్షల కోసం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌: 28-4-2023

by Harish |
పోటీ పరీక్షల కోసం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌: 28-4-2023
X

పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్ 1,2,3,4 పరీక్షలతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ వంటి అన్ని పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. కొన్ని ప్రశ్నాపత్రాల్లో 30 నుంచి 40 ప్రశ్నల వరకు కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దిశ క్రమం తప్పకుండా కరెంట్ అఫైర్స్ అందిస్తోంది.. అభ్యర్థులు దిశ కరెంట్ అఫైర్స్ ఉపయోగించుకుని మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ ఈ వారం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకోసం..

జాతీయ క్వాంటమ్ మిషన్‌కు కెబినెట్ ఆమోదం:

క్వాంటమ్ సాంకేతికతతో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన జాతీయ క్వాంటమ్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపింది. 2023- 31 మధ్య రూ. 60,003 కోట్లను దీనికి ఖర్చు చేయనున్నారు.

భారతీయ అమెరికన్ రాధా అయ్యంగార్‌కి రక్షణ శాఖ కీలక పదవి:

అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీ (మంత్రిగా) భారతీయ అమెరికన్ రాధా అయ్యంగార్ ప్లంబ్ నియామకాన్ని అమెరికా సెనెట్ 68 -30 ఓట్లతో ఆమోదించింది. రక్షణ శాఖలో సాధన సామాగ్రి సేకరణ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఈ పదవికి రాధా అయ్యంగార్‌ను అధ్యక్షుడు జో బైడెన్ 2022 జూన్‌లో నామినేట్ చేశారు. రక్షణ శాఖ ఉప మంత్రికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న రాధకు ప్రమోషన్ ఇచ్చారు.

ఏపీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ నిధి:

విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా ఏపీ రెడ్ క్రాస్ శాఖ విపత్తుల నిర్వహణ నిధి (క్లైమేట్ యాక్షన్ ఫండ్ - సీఏఎఫ్)ని ఏర్పాటు చేసింది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ నిధిని ఏపీ రెడ్ క్రాస్ అధ్యక్ష హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారికంగా ప్రారంభించారు. తొలి చందాగా ఆదిత్య సంస్థల తరఫున ఛైర్మన్ డాక్టర్ ఎన్.శేషారెడ్డి, డాక్టర్ సుగుణ రూ. 40 లక్షల చెక్కును గవర్నర్‌కు అందించారు. దేశంలో ఈ నిధిని ఏర్పాటు చేసిన తోలి శాఖగా ఏపీ రెడ్‌క్రాస్ నిలిచిందని తెలిపారు.

అత్యుత్తమ కంపెనీగా టీసీఎస్:

భారతదేశంలో పని చేయడానికి ఉత్తమ కంపెనీలుగా ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక మాధ్యమ సంస్థ లింక్డ్‌ఇన్ భారత్‌లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితాను వెలువరించింది. ఈ - కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ - ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ జాబితాలో టాప్ కంపెనీలు:

1. టీసీఎస్

2. అమెజాన్

3. మోర్గాన్ స్టాన్లీ

4. రిలయన్స్ ఇండస్ట్రీస్

5. మెక్వారీ గ్రూప్

6. డెలాయిట్

7. ఎన్ఏవీ ఫండ్

8. ష్నైడర్ ఎలక్ట్రిక్

9. వయాట్రిస్

10. రాయల్ కరేబియన్

ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డు:

అనకాపల్లి, లాతూర్ జిల్లాలకు ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నందుకు ఈ ఘనత దక్కింది. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ విభాగంలో మాహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ప్రథమ, ఏపీలోని అనకాపల్లి జిల్లా రెండో బహుమతి పొందాయి.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది అక్కుడున్న 576 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించారు. గ్రామస్థాయిలో 105 రకాల మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ప్రధాని ఈ అవార్డు అందించారు.

పాలమూరు, రంగారెడ్డి లో పర్యావరణ నష్ట నివారణపై అధ్యయనానికి కమిటీ :

పాలమూరు..రంగారెడ్డి ఎత్తుపోతల పథకంపై అధ్యయన కమిటీని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఏర్పాటు చేసింది. ఈ పథకంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పనుల కారణంగా పర్యావరణానికి వాటిల్లిన నష్టంపై ఈ కమిటీ అధ్యయనం చేయడంతో పాటు దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేస్తుంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు దీనిని ఏర్పాటు చేశారు. కమిటీకి డాక్టర్ ఎ.మల్హోత్రా ఛైర్మన్ గానూ కె.గౌరప్పన్, అశోక్ ఖర్య, ఎన్ లక్ష్మణన్, అమియా సాహూ, జేఏ జాన్సన్ సభ్యులుగా నియమితులయ్యారు.

22 ఏళ్లకే పీహెచ్‌డీతో నైనా జైస్వాల్ రికార్డు:

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 22 ఏళ్లకే రాజమహేంద్రవరంలో నన్నయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని రాజ్ భవన్‌లో నైనా జైస్వాల్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేశారు. భారతదేశంలో అతి చిన్న వయసులో డాక్టరేట్ పాందిన తొలి అమ్మాయి నైనా జైస్వాల్ కావడం విశేషం.

లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎనిమిదేళ్ల వయసులో పదో తరగతి పూర్తి చేసి ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిగా నమోదయ్యారు. పదేళ్ల వయసులో ఇంటర్ పూర్తి చేసింది. 13 ఏళ్లకే పట్టభద్రురాలైంది. అనంతరం ఎంఏ పూర్తి చేసిన ఆసియాలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు తాజాగా 22 ఏళ్లకే పీహెచ్‌డీ పూర్తి చేసి ఈ రికార్డు నెలకొల్పింది.

అత్యంత ప్రతికూల వాతావరణ సంవత్సరంగా 2022:

2022 ఏడాది మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించిందిగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది. యూఎన్ నేతృత్వంలో స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2022 నివేదికను విడుదల చేసింది. లానిసా పరిస్థితులున్నప్పటికీ ఇది 5వ లేదా 6వ వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిందని తెలిపింది. 2015 నుంచి ఎనిమిదేళ్లు అత్యంత వెచ్చగా ఉన్నాయని తెలపింది. 2022లో తీవ్ర వరదలు, రికార్డు స్థాయి వేడిగాలులు, కరువు పరిస్థితుల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలిపింది.

వ్యాక్సిన్ కి దూరంగా 27 లక్షల మంది చిన్నారులు:

భారతదేశంలో సాధారణ వ్యాక్సిన్ కు 27 లక్షల మంది చిన్నారులు దూరమయ్యారని యూనిసెఫ్ ప్రకటించింది. కరోనా - 19 తర్వాత వ్యాక్సిన్ల ప్రాముఖ్యతపై అవగాహన స్థిరపడిన లేదా మెరుగుపడిన 55 దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అయినప్పటికీ ఈ పరిస్థితులున్నాయని తెలిపింది.

వ్యాక్సిన్లు పొందని చిన్నారుల్లో సగం మంది 11 రాష్ట్రాల్లోని 143 జిల్లాల్లో ఉన్నారని యూనిసెఫ్ వైద్య నిపుణులు వెల్లడించారు. దీని వలన చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందని, భవిష్యత్తులో వారు ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్రికాలో 2019 - 2021 మధ్య కాలంలో కోటి 27 లక్షల మంది చిన్నారులు ఇదే పరిస్థితిలో ఉన్నట్లు యూనిసెఫ్ తెలిపింది.

టీ 20లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా ధోని:

ఎంఎస్ ధోని టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్‌లో మార్ క్రమ్ క్యాచ్ అందుకున్న ధోని మొత్తం 208 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. డికాక్ (207), దినేశ్ కార్తీక్ (205) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

సివిల్ సర్వీసెస్ డే - 2023:

ప్రభుత్వ పాలనాధికారులపై దేశం ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉందని, దానిని వారు నిలబెట్టుకోవాలని ప్రధాని మోడీ తెలిపారు. వారు తీసుకునే ప్రతి నిర్ణయానికి దేశ హితమే ఏకైక ప్రాతిపదిక కావాలని అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా బ్యూరోక్రాట్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పన్నుల సొమ్మును అధికార పార్టీ తన సొంత లబ్ధి కోసం వినియోగిస్తుందా, దేశం కోసం ఖర్చు చేస్తుందా అనే విషయాన్ని విశ్లేషించడం ప్రతి ప్రభుత్వ ఉన్నతోద్యోగి విధి అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story