లేటెస్ట్ కరెంట్ అఫైర్స్( ఏప్రిల్ 21, 2023)

by Harish |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్( ఏప్రిల్ 21, 2023)
X

మన్‌కీబాత్ 100వ ప్రసంగం:

ప్రధాని మోడీ ప్రతినెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్‌కీ బాత్ ఏప్రిల్ 30వ తేదీ నాటికి 100వ ఎపిసోడ్‌కు చేరుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 ప్రత్యేక నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నాణెంపై ఒకవైపు అశోక స్తూపం, దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. మరోవైపు మన్‌కీ బాత్ 100 అని ఉంటుంది.

అస్సాం- అరుణాచల్ సరిహద్దు ఒప్పందం:

యాబై ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం - అరుణాచల్‌ప్రదేశ్‌లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న 123 గ్రామాల సమస్య పరిష్కారానికి ఈ ఒప్పందం దోహదపడనుంది. ఇది చారిత్రక ఘట్టమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ సీఎం పెమాఖండూ పేర్కొన్నారు. దీనిపై 1972 నుంచి వివాదం కొనసాగుతోంది. తాజా ఒప్పందంతో ఈ వివాదాస్పద గ్రామాలపై రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ఇకపై కొత్త వాదనలు వినిపించడానికి వీలులేదు. సర్వే ఆఫ్ ఇండియా సంస్థ సవివర సర్వే ద్వారా కచ్చితమైన సరిహద్దుల్ని నిర్ణయిస్తుంది.

దీపికా మిశ్రకు వాయుసేన శౌర్య అవార్డు:

మధ్యప్రదేశ్ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ దీపికా మిశ్ర భారత వాయుసేన శౌర్య అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. రాజస్థాన్‌కు చెందిన దీపిక హెలికాప్టర్ పైలట్‌గా భారత వాయు సేనలో పనిచేస్తున్నారు. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌధరి చేతుల మీదుగా దీపిక వాయుసేన పతకం అందుకున్నారు.

అత్యంత సంతోషకరమైన రాష్ట్రం మిజోరాం :

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా సర్వేలో తొలి స్థానం సాధించింది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ రాజేశ్ కె. పిలానియా కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, వృత్తి, మతం, కొవిడ్ 19 ప్రభావం, దాతృత్వం అనే ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సర్వే నిర్విహించారు. ఈ అంశాలు స్థానిక ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఆనందంపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి మిజోరంను అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగానూ మిజోరాం కి గుర్తింపు ఉంది.

స్పేస్ఎక్స్ సంస్థ.. స్టార్‌‌‌‌షిప్ ప్రయోగం విఫలం:

స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ ప్రయోగ పరీక్ష విఫలమైంది. అమెరికాలో గాల్లోకి ఎగిరిన ఈ భారీ రాకెట్ కేవలం 4 నిమిషాలకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలిపోయింది. స్టార్‌షిప్ పొడవు 120 మీటర్లు. ఇందులో 33 ఇంజిన్లు ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాకెట్‌గా ఇది పేరుగాంచింది. తొలి ప్రయోగ పరీక్షలో భాగంగా ఈ రాకెట్ దక్షిణ టెక్సాస్‌లోని బొకా చికా తీరం నుంచి నింగిలోకి ఎగిరింది. భూ ఉపరితలం నుంచి 39 కి.మీ ఎత్తు వరకు చేరుకుంది. అప్పటికే ఇంజిన్లు పనిచేయకపోవడంతో రాకెట్ కూలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed