లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: జాతీయ అంశాలు

by Harish |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: జాతీయ అంశాలు
X

జాతీయం:

జల సంరక్షణలో ప్రజా భాగస్వామ్యం అవసరం:

నీటి సంరక్షణ చర్యల్లో ప్రభుత్వాల ప్రయత్నాలు ఒక్కటే చాలవని, ప్రజలను భాగస్వాములుగా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే రాష్ట్రాల జలవనరుల మంత్రులు జాతీయ సదస్సు భోపాల్‌లో మొదలైంది. దీనిని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రసంగించారు.

భారతదేశంలో పురుషులు, మహిళలు -2020 నివేదిక ముఖ్యంశాలు:

దేశంలో మొత్తం 4,235 అసెంబ్లీ స్థానాలుంటే అందులో మహిళల సంఖ్య 476 (11 శాతం) మాత్రమే.

ఏపీలో 8 శాతం ఉండగా ఇది తెలంగాణలో 5 శాతం సగటు కన్నా తక్కువగా ఉంది.

అత్యధికంగా పుదుచ్చేరిలో 32 శాతం మహిళలున్నారు.

కేంద్ర మంత్రుల్లో మహిళలు 1995లో 11.54 శాతం ఉండగా 2020 నాటికి అది 9.26 శాతానికి తగ్గింది.

అక్షరాస్యత:

దేశంలో 15-24 ఏళ్ల వయసు వారిలో అత్యధికంగా కేరళలో 99 శాతం యువతీ యువకులు అక్షరాస్యతను సాధించారు.

ఏపీ, తెలంగాణ యువతరంలో 90.8 శాతం అబ్బాయిలు, 83.2 శాతం అమ్మాయిలు అక్షరాస్యులు.

జాతీయ స్థాయిలో 2017 నాటికి సగటు అక్షరాస్యత మహిళల్లో 70.3 శాతం కాగా పురుషుల్లో 84.7 శాతంగా ఉంది.

2011 నుంచి 17 మధ్య కాలంలో జాతీయ అక్షరాస్యత 73 నుంచి 77.7 శాతానికి పెరిగింది.

వైద్యవిద్యలో మహిళలే మెరుగు:

2018 -19లో దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ఎంబీబీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో 59.8 శాతం, ఉపాధ్యాయ డిగ్రీల్లో 59.6 శాతం అమ్మాయిలు ఉన్నారు.

ఇదే ఏడాది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారిలో 31.6 శాతం అమ్మాయిలున్నారు.

దేశంలో 2018-19లో రోజు కూలీ (జాతీయ సగటు) పట్టణాల్లో పురుషులకు రూ. 342, మహిళలకు రూ. 205; గ్రామాల్లో పురుషులకు రూ. 277, మహిళలకు రూ. 170 లభించింది.

భారత వృద్ధి అంచనాను తగ్గించిన ప్రపంచ బ్యాంకు..!

భారత వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గింపు: వరల్డ్ బ్యాంక్

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది.

భారత్‌లో ప్రభుత్వం మౌలిక సదుపాయాల వ్యయం పెంచడం, వ్యాపారాల్లో సులభతర చర్యల ద్వారా ప్రైవేటు పెట్టుబడుల మద్దతు ద్వారా తయారీ సామర్థ్యం విస్తరించనుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.

2022-23 ప్రథమార్థంలో ప్రైవేట్ వినియోగం, స్థిరమైన పెట్టుబడుల ద్వారా భారత జీడీపీ 9.7 శాతం పెరిగింది.

ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటును 6.9 శాతంగానూ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగానూ అంచనా వేసినట్లు పేర్కొంది.

ఎంవీ గంగా విలాస్ ప్రారంభం:

ఎన్నో పుణ్యక్షేత్రాలు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన మన భారత్‌లో పర్యటించేందుకు ప్రపంచ నలుమూలల నుంచీ ఏటా లక్షలాది మంది పర్యాటకులు దేశానికి వస్తుంటారు. భారతీయులు సైతం వివిధ రాష్ట్రాలను సందర్శిస్తుంటారు.

అలాంటి వారికి సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు భారత పర్యాటక శాఖ సిద్ధమైంది.

ఇందుకోసం ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ నౌకను సిద్ధం చేసింది.

అత్యంత విలాసవంతంగా ఉండేలా రూపొందించిన ఈ క్రూయిజ్ పేరు 'ఎంవీ గంగా విలాస్'.

62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఈ ఓడను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 13న(శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో గంగానది ఒడ్డున ప్రారంభించారు.

ఇదే కార్యక్రమంలో రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు సైతం ప్రారంభోత్సవం చేశారు.

'ఎంవీ గంగా విలాస్' తన ప్రయాణాన్ని వారణాసి నుంచి ప్రారంభించనుంది. మొత్తం 51 రోజుల పాటు 27 నదీ జలాల గుండా 3,200 కి.మీ ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలోని దిబ్రూగఢ్ చేరుకుంటుంది.

క్రూయిజ్ విశేషాలు

గంగా విలాస్ క్రూయిజ్‌‌లో మూడు డెక్స్(అంతస్తులు/ఓడ పైభాగం) ఉన్నాయి.

36 మంది పర్యాటకులను తీసుకువెళ్లే సామర్థ్యం గల ఈ ఓడలో సకల విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన 18 సూట్‌(గదుల వరుస)లు ఉన్నాయి.

మ్యూజిక్, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ ఎయిర్ అబ్జర్వేషన్ డెక్, వ్యక్తిగత సహాయక సిబ్బంది సహా అనేక లగ్జరీ సౌకర్యాలు గల ఈ ఓడలో పర్యటించాలనుకునేవారు 'అంటారా(ANTARA) లగ్జరీ రివర్ క్రూయిసెస్' వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

51 రోజుల ప్రయాణానికి రూ.12.59 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రోజుకు రూ.25 వేలు ఉంటుంది.

ఈ ఓడను వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసింది.

స్విట్జర్లాండ్‌ నుంచి తొలి పర్యాటకులు

ఈ ఓడలో తొలి పర్యటనను స్విట్జర్లాండ్‌కు చెందిన 32మంది పర్యాటకులు బుక్ చేసుకున్నారు.

వీరు 51 రోజుల పాటు ఇందులో ప్రయాణించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed