లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ (ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్)

by Harish |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ (ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్)
X

ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్‌కు భారత్ ఎన్నిక:

జనవరి 1వ తేదీ నుంచి నాలుగు ఏళ్ల కాలానికి ఐక్యరాజ్య సమితి అత్యున్నత గణాంక కమిషన్ సభ్యురాలిగా భారత్ ఎన్నికైంది. గణాంకాలు, వైవిధ్యం, జనాభా అంశాల్లో గల నైపుణ్యాలు, ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్‌లో భారతదేశం సభ్యత్వం పొందటానికి దోహదపడ్డాయని తెలిపారు.

నాటో కూటమిలోకి ఫిన్లాండ్:

ఐరోపా సమాఖ్యలోని కీలక దేశం ఫిన్లాండ్ నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది. దీనికి సంబంధించిన చేరిక పత్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు అందజేశారు. అంతకు ముందు ఫిన్లాండ్ చేరికను బ్లింకెన్ ప్రకటించారు. నాటోలో ఫిన్లాండ్ చేరేందుకు చివరగా ఆమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది.

రష్యాకు యూఎన్ఎస్‌సీ బాధ్యతలు:

ఐరాస భద్రతామండలి (యూఎన్ఎస్‌సీ) అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి. యూఎన్ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఏప్రిల్ నెలకుగానూ ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. యూఎన్ఎస్‌సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పెర్రీ తెలిపారు.

జియో ట్యాగింగ్‌లో కేరళకు అగ్రస్థానం:

జియో ట్యాగింగ్‌లో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఏడాదికి ఆ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకే అత్యధిక జియోట్యాగ్‌లు లభించాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) రికార్డుల ప్రకారం కేరళకు చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్చూజాలకు జియో ట్యాగ్ లు లభించాయి.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్:

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చోటు లభించింది. సామాజిక సేవా విభాగంలో ఒక గంటలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు కల్పించినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ తెలిపారు. సంతోష్‌కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది.

భారత వృద్ధి 6.3 శాతం:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. 6.3 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. గతంలో ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటును 6.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రుణ రేట్లు పెరగడం, ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించడం తో పాటు ప్రైవేటు వినిమయం తగ్గుముఖం పట్టనుంది. కొవిడ్ కాలంలో ప్రకటించిన ఆర్థిక మద్దతును క్రమంగా ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వ వ్యయాలు కూడా వృద్ధి చెందనున్నాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో భారత్ 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024-26 మధ్య 7 శాతం సగటు వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ద్రవ్యోల్బణం 5.2 శాతం తగ్గుతుందని అంచనా వేసింది.

చినజీయర్‌కు పద్మ భూషణ్ ప్రదానం:

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 53 మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందించారు. తెలుగు వారైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి పద్మభూషణ్‌ను అందుకోగా, సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, చిరుధాన్యాల ప్రచారకర్త దూదేకుల ఖాదర్ వలి (కర్ణాటక నుంచి), డాక్టర్ అబ్బా రెడ్డి నాగేశ్వరరావు పద్మశ్రీలను స్వీకరించారు.

కిరణ్ నాడార్‌కు ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారం:

సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో అవిరళ కృషి చేస్తున్న కిరణ్ నాడార్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మనుయేల్ లీనన్ ఆ పురస్కారాన్ని కిరణ్ నాడార్ కు అందజేసి సత్కరించారు. అంతర్జాతీయ కళాకృతులు సేకరిస్తున్న నాడార్ ఇండో ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను ఫ్రాన్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

కిరణ్ నాడార్ మ్యూజియం ఆర్ట్ (కేఎన్ఎంఏ) ఛైర్‌పర్సన్, శివ్ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ నాడార్ పలు సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed