మూసీ.. ఓ ‘మని’హారం!

by Shyam |
మూసీ.. ఓ ‘మని’హారం!
X

దిశ, న్యూస్ బ్యూరో: ‘ప్రతిష్టాత్మకం.. ప్రయోగాత్మకం.. ఆపై పూర్తిపత్రం.. చివరికి విఫలయత్నం’ ఇది అసలు కథ. అదేమిటంటే నగరానికే తలమానికంలా ఉన్న మన మణిహారం విషయంలో ఇదే జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆవైపు అడుగులు వేస్తోంది. ఇలా సరికాని ప్రయాణాలతో కార్యం సఫలం కాదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. విషయమేమిటంటే.. గతంలో ప్రభుత్వం ఆగమేఘాల మీద ఓ కార్యక్రమం చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. అనుకున్నట్టుగానే ఆ దిశగా కొంతవరకు అడుగులు వేసింది. అందుకు ఉన్నదాంట్లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసింది. అంతేకాదు హడావుడి కూడా బాగానే చేసింది. చివరకు ఏం అయ్యిందో తెలియదు గానీ గాలికి వదిలేసింది. కానీ, లెక్కల్లో మాత్రం చుక్కులు చూపించింది. దీంతో చివరకు ప్రజలు విమర్శించే అవకాశం కల్పించింది. ఇప్పుడు చేస్తామంటూ మళ్లీ సిద్ధమవుతోంది.

జాతీయస్థాయిల్లో కాలుష్యకారక నదుల్లో నాలుగో స్థానంలో నిలిచిన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసీ కోసమే ప్రత్యేకంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లు ఏర్పాటు చేసి నీటి శుద్ధీకరణ చేస్తామంటూ ప్రజల్లో భారీస్థాయిలో హడావుడి చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకు నది ప్రక్షాళనను అడుగులు వేసింది. ప్రక్షాళన కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసి ప్రతీ ఏటా బడ్జెట్లో రూ. వందల కోట్ల కేటాయింపులు చేసింది. అలా అక్కడి వరకు ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది. కానీ, అసలు విషయానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రక్షాళనను పూర్తి స్థాయిలో చేపట్టడంలేదు. అసలు ఆ అంశాన్నే గాలికి వదిలేసింది. కానీ, కాగితాల్లో మాత్రం డబ్బులు బాగా ఖర్చయినట్టుగా లెక్కలు చూపిస్తుంది. అసలు విషయానికి వస్తే మూసీలో ఇంతవరకు లీటర్ నీళ్లు కూడా శుద్ధి కాలేదు.

అయితే.. తాజాగా మరోసారి..

రెండో ఏడాది పదవీకాలం ముగిసేలోపు మూసీనదిని పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తామంటూ తాజా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది మొదటిసారి వాగ్దానం కాదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇదే మాటను పదేపదే చెబుతోంది. మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌నుకు తాజాగా బడ్జెట్ కేటాయించింది. అన్ని అవసరాలకు కలిపి హైదరాబాద్ నగరానికి రూ.10 వేల కోట్లు కేటాయించగా అందులో మెజారిటీ భాగం మూసీ శుద్ధీకరణ కోసమే ఉపయోగిస్తున్నామని ప్రభుత్వ నేతలు చెబుతున్నారు.

అయితే గతంలో కూడా ఇలాగే 2017 బడ్జెట్లోనూ రూ.1,700 కోట్లను మూసీ ప్రక్షాళన కోసమే ఖర్చు చేస్తామన్నారు. నది ప్రక్షాళనలపై అధ్యయనం చేసేందుకు మేయర్, పలువురు చైర్మన్లు, ఎండీలు కలిసి అహ్మదాబాద్, చైనా, సింగపూర్ తదితర ప్రాంతాలను కూడా పర్యటించారు. కానీ, ప్రక్షాళన అంశం అలా మిగిలిపోయింది. చివరకు అది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా మారిపోయింది.

దశలవారీగా చేపట్టే ఈ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం 60 శాతం, రాష్ట్రం ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూరుస్తోంది. కేంద్ర జలశక్తి అభియాన్, ఎన్‌ఆర్‌సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి) పథకాల కింద 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడంతో తాజాగా మూసీ పరీవాహక ప్రాంతంలో మురుగునీటిని ప్రక్షాళన చేసేందుకు సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

గత ఐదేండ్ల కాలంలో మూసీలోని డెబ్రిస్ తొలగింపు కోసమే రూ.400 కోట్ల నుంచి 500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోందని, ప్రక్షాళన ఎంత వరకూ జరిగిందో అధికారులే చెప్పాల్సి ఉంటుందని సామాజిక కార్యకర్త డేగ హరీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు మారుతున్నారు.. వేల కోట్ల కేటాయించి వాటిని ఖర్చు చేస్తూ పత్రాల మీదనే మూసీ ప్రక్షాళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

చిత్తశుద్ధిలేని కార్యాచరణలు

మూసీ నది ప్రక్షాళన ప్రభుత్వానికి ఓ ప్రహసనంగా మారిపోయింది. ప్రత్యేకబోర్డు ఏర్పాటు, నిధుల కేటాయింపులు చూస్తే బాగానే ఉన్నా గత ఆరేండ్లలో ప్రక్షాళన పదిశాతం కూడా దాటలేదంటే అతిశయోక్తి కాదు. విషయమేమిటంటే.. ప్రధానంగా నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధిచేసి తిరిగి నదిలోకి వదలుతున్నారన్నది అందరికీ తెలిసిందే.. దీన్ని నివారించనిదే మూసీ శుద్ధీకరణ సాధ్యపడదు. డెబ్రిస్ వ్యర్థాలను కూడా ఇష్టారీతిలో నదికి ఇరువైపులా వేయడంతో ప్రవాహానికి అడ్డుగా మారింది. గతంలో కొందరు అధికారులు మూసీ ప్రక్షాళన కోసం చిత్తశుద్ధిగా పనిచేసినా లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యంకాలేదు. రాత్రి సమయాల్లో మూసీనదిలో వ్యర్థాలను విడుదల చేసేవారిని గుర్తించేందుకు ఒక అధికారి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల తర్వాత దుండగులు ఆ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత అలాంటి పటిష్ట వ్యవస్థలు రూపొందించి కార్యాచరణ చేసిన వారెవరూ కనిపించడంలేదు. ఎప్పుడైనా మూసీలో వ్యర్థాలను తొలగించినవారు తిరిగి వేరే ప్రదేశంలో మళ్లీ మూసీలోనే కలుపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పత్రాల మీద వేల కోట్లు ఖర్చవుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం చిత్తశుద్ధి లేకపోవడంతో మూసీ ప్రక్షాళన అసాధ్యమనేది తేలిపోతుంది.

Tags: Budget, Musi, hmda, water board, clean, fund, rivers

Advertisement

Next Story

Most Viewed