- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కునాల్ కామ్రాకు మధ్యంతర ముందస్తు బెయిల్

- మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు
- మహారాష్ట్ర కోర్టులను ఆశ్రయించలేకపోతున్నట్లు వివరణ
- శివసేన, శిండే మద్దతుదారుల నుంచి బెదిరింపులు
దిశ, నేషనల్ బ్యూరో: స్టాండప్ కమేడియన్ కునాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ముంబైలో నమోదైన కేసు నేపథ్యంలో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కమ్రాకు ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామ్రాపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్రలోని కోర్టులను ఆశ్రయించలేకపోతున్నాడని.. అందుకే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ పెట్టుకున్నట్లు జస్టిస్ సుందర్ మోహన్ గుర్తించి.. బెయిల్ ఉత్తర్వులు మంజూరు చేశారు. కునాల్ కామ్రాపై బెదిరింపులకు పాల్పడినట్లు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్‌ను కోర్టుకు సమర్పించారు. కాగా, జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ముందు బాండ్ సమర్పించాలనే కండిషన్‌తో కామ్రాకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.
ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న హాబిటాట్ కామెడీ క్లబ్‌లో జరిగిన స్టాండప్ ప్రదర్శనలో షిండే పేరును వాడకుండానే.. 2022లో జరిగిన రాజకీయ పరిణామాలపై ఒక పేరడీ పాటను పాడారు. అందులో గద్దార్ (దేశద్రోహి) అని సంబోధించడంతో కామ్రాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. శిండేను ఉద్దేశించే గద్దార్ అన్నావంటూ దాదాపు 500 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కామ్రా తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. కాగా, ఈ షో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన గంట తర్వాత శివసేన కార్యకర్తలు స్టుడియోతో పాటు క్లబ్ ఉన్న హోటల్‌ను ధ్వంసం చేశారు. కాగా, కామ్రాను నిజంగానే బెదిరింపులు వస్తున్నాయని.. ఇందులో అధికార పార్టీ మంత్రులు కూడా ఉన్నారని కామ్రా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కామ్రాకు 'శివసేన శైలిలో గుణపాఠం చెప్తాం' అంటూ బెదిరించారని.. శివసేన శైలి అంటే ఏంటో అందరికీ తెలుసని న్యాయవాది కోర్టుకు వివరించారు.
వాక్ స్వాతంత్రంలో భాగంగా వ్యంగ్యానికి కూడా రక్షణ ఉంటుందని.. జనవరిలో చిత్రీకరించిన ఈ షోలో కామ్రా ఎవరి పేర్లను కూడా ప్రస్తావించలేదని అతని తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వ్యంగ్యం, పేరడీ అనేది వాక్ స్వాతంత్రంలో భాగమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కూడా న్యాయవాది గుర్తు చేశారు. ఆరోగ్యకరమైన నాగరిక సమాజంలో భావ ప్రకటనా స్వేచ్ఛ అంతర్భాగమని సుప్రీంకోర్టు అంతకు ముందు పేర్కొన్నదని చెప్పారు.