RBI: ఈ నెలాఖరు మూడు రోజులూ పని చేయనున్న బ్యాంకులు

by S Gopi |   ( Updated:2025-03-28 12:56:32.0  )
RBI: ఈ నెలాఖరు మూడు రోజులూ పని చేయనున్న బ్యాంకులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా చివరిరోజు ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు షెడ్యూల్ చేసిన మార్చి 31 సెలవును రద్దు చేసింది. మార్చి 31 కంటే ముందు ఆర్థిక సంవత్సరం ముగింపునకు సంబంధించి నిర్వహించాల్సిన ప్రత్యేక క్లియరింగ్ కార్యకలాపాల్లో అన్ని బ్యాంకులూ పాల్గొనాలని స్పష్టం చేసింది. ఆరోజున ప్రభుత్వ ఆదాయం, చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని, వాటి లావాదేవీలను జరపాల్సిన బ్యాంకులు తప్పనిసరిగా విధుల్లో ఉండాలని ఆదేశించింది. బ్యాంకులతో పాటు మార్చి 29-31 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను, సీజీఎస్టీ ఆఫీసులు కూడా పనిచేయనున్నాయి. పెండింగ్‌లో ఉండే పన్ను చెల్లింపుదారుల సంబంధిత లావాదేవీలను పూర్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. మరోవైపు, పాలసీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు మార్చి 29, 30, 31 తేదీల్లో తమ కార్యాలయాలను తెరిచి ఉంచాలని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) కూడా బీమా కంపెనీలను ఆదేశించింది.

Next Story