యువకుడిని తుక్కు తుక్కుగా కొట్టిన కూరగాయల వ్యాపారులు.. ప్రతి శనివారం అలా చేస్తున్నాడనే..!

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-06-22 13:57:20.0  )
యువకుడిని తుక్కు తుక్కుగా కొట్టిన కూరగాయల వ్యాపారులు.. ప్రతి శనివారం అలా చేస్తున్నాడనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఖరీదైన ఫోన్లు ఉంటున్నాయి. మరికొంత మంది డబుల్ ఫోన్లను వాడుతుంటారు. ఇలా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగినట్టే దొంగతనాలు పెరిగిపోయాయి. ఫోన్ జేబులో పెట్టుకుని బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చోరీకి గురువుతున్నాయి. గతంలో పర్సులు కొట్టేసిన దొంగలు.. డిజిటల్ చెల్లింపులు వచ్చాక పర్సుల్లో డబ్బులు ఉండటం లేదని సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

కరీంనగర్ మార్కెట్‌లో ప్రతి శనివారం సంత జరుగుతుంది. ఈ క్రమంలో కూరగాయలకు వచ్చేవారి నుంచి ఫోన్లు పోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఇది కొనసాగుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇవాళ మార్కెట్లో కూరగాయలు కొనడానికి వచ్చిన వారి నుంచి దొంగలు పది ఫోన్లు కొట్టేశారు. ఓ వ్యక్తి నుంచి ఫోన్ దొంగిలిస్తుండగా కూరగాయల వ్యాపారులు పట్టుకున్నారు. వెంటనే అతడిని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. అతడి నుంచి కొట్టేసిన రూ.50 వేల విలువైన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, నాగపూర్ నుంచి వచ్చిన నలుగురు యువకులు పథకం వేసి సెల్​ఫోన్లను దొంగలిస్తున్నట్లు పట్టుబడిన యువకుడు తెలిపారు. దొంగకు స్థానికులు, కూరగాయల వ్యాపారులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, ప్రతి శనివారం రైతు బజారులో సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయని పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన పోలీసులు నిఘా పెట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.

Advertisement

Next Story