ఉపాధి కోసం వెళ్లిన యువకుడు తిరిగి రాని లోకాలకు..

by Sumithra |
ఉపాధి కోసం వెళ్లిన యువకుడు తిరిగి రాని లోకాలకు..
X

దిశ, నవాబుపేట : ఉపాధి కోసం ఊరు వదిలి వెళ్ళిన యువకుడు పనులు ముగించుకుని తనకుటుంబ సభ్యులందరితో సరదాగా గడుపుదామని తిరిగి ఇంటికి వస్తూ మార్గమధ్యంలో విద్యుత్ ఘాతానికి గురై దుర్మరణం చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే మండలంలోని గురుకుంట గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లెమోనిదొడ్లకు చెందిన పల్లెమోని కేశవులు (24) అనే యువకుడు గురువారం రాత్రి యాదాద్రి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని కమలలోని బావి సమీపంలో మృతి చెందారు. దీంతో ఆ యువకుని స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

వృత్తిరీత్యా వరికోత మిషన్ నడిపే కేశవులు తన భార్య అశ్విని కుమారుడికి జన్మనిచ్చిన ఆరు రోజులకే చిన్నారి శిశువుతో పాటు భార్యను కూడా ఇంటి వద్ద వదిలేసి 15 రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో వరికోతలు కోయడానికి హార్వెస్టర్ తీసుకుని వెళ్లారు. అక్కడ వరి కోతలు దగ్గర పడడంతో మిగతా హార్వెస్టర్ మిషన్ల వారితో పాటు తాను కూడా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. శుక్రవారం తెల్లవారేసరికి ఇంటికి చేరుకుంటానని తన కుటుంబ సభ్యులకు కబురు చేరవేసి, తన వారిని మరికొన్ని గంటల్లో కలుస్తాననే సంతోషంతో హార్వెస్టర్ నడుపుతూ వస్తున్న ఆయనను రోడ్డుకు అడ్డంగా ఉన్న 11 కేవి విద్యుత్ వైర్ కబళించి వేసింది.

హార్వెస్టర్ పై భాగంలో తాకిన 11 కేవీ విద్యుత్ వైర్ చీకట్లో సరిగా కనిపించకపోవడంతో అది సర్వీస్ వైర్ అయి ఉంటుందని భావించిన కేశవులు ఆ వైరును చేతితో తొలగించి మిషన్ ను ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. ఆయన పట్టుకున్నది 11 కేవి వైర్ కావడంతో ఆ వైర్ నుండి ప్రసరించిన విద్యుత్ అతనిని అక్కడికక్కడే కబళించి వేసింది. ఆయన వెహికిల్ వెనుక ఉన్న మిగతా వెహికిళ్ళ వారు వచ్చి చూసి విద్యుత్ వైర్లు తొలగించే ప్రయత్నం చేసేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పల్లెమోని దొడ్ల కాలనీలో నివాసముంటున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం వల్ల ఆ కుటుంబ సభ్యుల రోదనలతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు కేశవులకు భార్య అశ్విని, నెలలు నిండని ఒక బాబు, తల్లి, సోదరుడు సోదరి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed