ఫోన్ చోరీ చేసి...రూ.89 వేలు మాయం చేసి...

by Sridhar Babu |
ఫోన్ చోరీ చేసి...రూ.89 వేలు మాయం చేసి...
X

దిశ, బోథ్ : సెల్ ఫోన్ చోరీ చేసిన నిందితుడు ఫోన్​ యజమాని ఖాతా నుంచి రూ.89 వేలు మాయం చేశారు. మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారసంత నిర్వహిస్తారు. ఈ వారసంతకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా వస్తారు. గత మంగళవారం మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన శుద్ధ స్వామి బోథ్ లో జరిగే వారసంతకు రాగా కూరగాయలు కొనుగోలు చేస్తున్న క్రమంలో తన సెల్ ఫోన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అయితే సెల్ ఫోన్ పోయిన విషయాన్ని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు చేసిన అనంతరం సిమ్ కార్డును బ్లాక్ చేయించి కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. ఫిర్యాదు చేసి సిమ్ మార్చిన తర్వాత బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో తన సెల్ ఫోన్ నుండి ఫోన్ పే ద్వారా లక్ష రూపాయలు మాయమయ్యాయని బాధితుడు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 89 వేల రూపాయలు పశ్చిమబెంగాల్ కు చెందిన సంజయ్ చౌదరి అనే వ్యక్తి ఖాతాలోకి మార్పిడి కాగా మరో 11 వేల రూపాయలు హోల్డ్ లో ఉన్నాయని బాధితుడికి పోలీసులు తెలిపారు. అయితే హోల్డ్ అయిన డబ్బుల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story