డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో సింగపూర్‌ మహిళకు ఉరిశిక్ష.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి

by Vinod kumar |
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో సింగపూర్‌ మహిళకు ఉరిశిక్ష.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి
X

సింగపూర్‌ సిటీ : డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఓ మహిళను సింగపూర్‌ ఉరితీసింది. స్థానికంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ‘సారిదేవి దామని (45)కి విధించిన ఉరిశిక్ష శుక్రవారం అమలయ్యింది’ అని సింగపూర్‌ సెంట్రల్‌ నార్కోటిక్స్‌ బ్యూరో ఓ ప్రకటనలో తెలిపింది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో.. 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. నేరారోపణలు, శిక్షకు వ్యతిరేకంగా ఆమె అప్పీల్ చేసుకున్నప్పటికీ.. 2022 అక్టోబరులో కోర్టు దాన్ని కొట్టేసింది.

దేశ అధ్యక్షుడు సైతం ఆమె క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించారు. అంతకుముందు 2004లో యెన్‌ మే వూయెన్‌ (36) అనే మహిళకు ఇదే తరహా కేసులో ఉరిశిక్ష అమలైంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదకద్రవ్యాల నిరోధక చట్టాలు సింగపూర్‌లో అమలులో ఉన్నాయి. వాటి ప్రకారం.. 500 గ్రాములకు మించి గంజాయి, 15 గ్రాములకుపైగా హెరాయిన్‌ను రవాణా చేస్తూ పట్టుబడితే మరణశిక్ష విధించొచ్చు.

Advertisement

Next Story