షాపులో కొనుగోళ్లు...బార్ లో విక్రయం

by Sridhar Babu |
షాపులో కొనుగోళ్లు...బార్ లో విక్రయం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అడ్డదారిలో లాభాలను అర్జించడానికి బార్‌ యజమానులు ఎవ్వరికీ అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు చేపడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. మేడ్చల్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఎం/ఎస్‌ హార్ట్‌ కప్‌ కపే రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లో మంగళవారం రాత్రి రంగారెడ్డి ఎస్టీఎఫ్ బీ టీమ్‌ సీఐ సుబాష్‌ చందర్‌, ఎస్సై అఖిల్‌ కలిసి మద్యాన్ని తనిఖీ చేశారు.

బార్‌లో ఉన్న ఓడ్కా, వీస్కీ బాటిళ్లపై బార్‌ కోడ్‌ చేశారు. ఈ బార్‌ పేరున ఉండాల్సిన మద్యం బాటిళ్లు ఇతర ప్రాంతానికి చెందిన మద్యం దుకాణానికి చెందినవిగా గుర్తించారు. బార్‌లో అమ్మాల్సిన మద్యం మరో దుకాణానికి చెందినవిగా నిర్దారించారు. దాంతో బార్​ యజమానిపై, బార్‌పై కేసు నమోదు చేసి మేడ్చల్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు.

తప్పుడు మద్యం అమ్మకాలు జరిపితే చర్యలు..

ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను అరికట్టడానికి ఎక్సైజ్‌ శాఖ కంటిపై కునుకు లేకుండా శ్రమిస్తున్నారని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌. కిషన్‌ అన్నారు. స్థానికంగా మద్యం డిపోలో కొనుగోలు చేయాల్సిన మద్యాన్ని మద్యం షాపుల నుంచి తీసుకువచ్చి బార్​లో అమ్మకాలు జరపడం నేరమని అన్నారు. బార్‌ యజమానులు పన్నుల నుంచి తప్పించుకోవడానికి మద్యం షాపుల్లోని మద్యాన్ని బార్లలో వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఈ విషయంలో బార్లు, పబ్బుల యజమానులు తస్మత్‌ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఒక చోట అమ్మకాలు చేపట్టాల్సిన మద్యాన్ని మరో చోట విక్రయిస్తున్న బార్‌ యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.లక్ష ఐదు వేలు ఉంటుందని తెలిపారు. 35 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా మద్యాన్ని పట్టుకున్న ఎస్టీఎఫ్​ టీమ్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Advertisement

Next Story