పోలీస్ వాయిస్‌తో సైబర్ నేరగాళ్ల బెదిరింపులు..

by Sumithra |   ( Updated:2024-10-23 08:47:57.0  )
పోలీస్ వాయిస్‌తో సైబర్ నేరగాళ్ల బెదిరింపులు..
X

దిశ, సిటీ క్రైమ్ : సైబర్ నేరగాళ్ల పోలీస్ స్టైల్ బెదిరింపులకు హైదరాబాద్ కు చెందిన ఓ యువతి 44 లక్షలు పోగొట్టుకుంది. మోసపోయానని తెలిసి 1930 కు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పై సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు మహిళను బయటపెట్టిన తీరు ఇలా... ఓ మహిళకు 2 గంటల్లో మీ ఫోన్ బ్లాక్ అవుతుంది. వెంటనే మీరు ఈ నెంబరుకు ఫోన్ చేయండి. అంటూ ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆ మహిళ మెసేజ్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసింది. కాల్ ఎత్తగానే మేము అంధేరి పోలీసులము మాట్లాడుతున్నామని చెప్పారు. మీ ఫోన్ నెంబరుతో అశ్లీల వాణిజ్య ప్రకటనలు చేయడంతో పాటు మెసేజ్ తో వేధిస్తున్నారనే అంశం పై కేసు నమోదైందని చెప్పారు. ఫోన్ లో మహిళ పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైందని దానిని చదివి వినిపించారు.

ఆ తర్వాత కాల్ ను అంధేరి సైబర్ క్రైం పోలీసులకు కలుపుతున్నానని చెప్పాడు. అంధేరి సైబర్ క్రైం పోలీసు అధికారినంటూ మాట్లాడుతున్న మరో వ్యక్తి మీ ఫోన్ బ్లాక్ కాకుండా ఉండాలంటే ముందుగా మీరు మీ ఆధార్ కార్డు నెంబరు చెప్పండని వివరాలు తీసుకున్నాడు. ఆధార్ కార్డు నెంబరును రిపీట్ చేస్తున్న సమయంలోనే ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి వెనకాల నుంచి మరో గొంతుతో ఈ మహిళ నరేష్ గోయెల్ మని లాండరింగ్ కేసులో వాంటెడ్ ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారని బెదిరించే ధోరణిలో హై టెన్షన్ ను నడిపించారు. నరేష్ గోయెల్ ఇంట్లో సోదాలు జరిపినప్పుడు మీ పేరుతో ఉన్న ఏటీఎం కార్డు దొరికిందని, దాంతో 6 కోట్ల లావాదేవిలు జరిగాయని చెబుతూ మీ అరెస్టు తప్పనిసరని భయపెట్టించాడు. నాకు నీవు అమాయకురాలివని తెలుసు కాని నేను ఏం చేయలేను.. నీవు నిర్ధోషివని తేలాలంటే మాకు సహకరించాలంటూ నకిలి సుప్రీం కోర్టు, ఆర్బీఐ నోటీసులను పంపాడు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరుతో ఉన్న ఈ నకిలీ కాపీలో మీరు పోలీసు అరెస్టు నుంచి బయటపడాలంటే మీరు మీ మొత్తం నగదును ఆర్బీఐకు డిపాజిట్ చేయాలని అందులో రాసుంది.

వాటిని పరిశీలించిన తర్వాత నరేష్ గోయెల్ మనీలాండరింగ్ కు ఏమి సంబంధం లేదని తేలిన తర్వాత వాటిని తిరిగి పంపిస్తామని నమ్మించారు. దీని కోసం సైబర్ నేరగాళ్లు ఓ నకిలీ లింక్ ను పంపించారు. లింక్ ను క్లిక్ చేయగానే అది సుప్రీంకోర్టు అని ఉన్న పేజీలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఆధార్ కార్డులోని చివరి 6 అంకెలను నమోదు చేయమని చెప్పాడు. అలా చేయగానే సివిల్ అప్పీల్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తుంది. దాంతో నగదును ఆ లింక్లో ఆర్బీఐ ఖాతాలో జమ చేయండని చెప్పాడు. లేదంటే మీ మీద మొత్తం 17 ఆర్ధిక నేరాల కేసులు నమోదవుతాయని చెప్పాడు. దీనికి మరణ శిక్ష పడుతుందని బెంబేలెత్తించారు. మ్యూచువల్ ఫండ్స్ , ఫిక్స్డ్ డిపాజిట్ లను బలవంతంగా ముందస్తుగా విత్ డ్రా చేసేలా చేసి మొత్తం 44 లక్షలను సైబర్ నేరగాళ్లు మహిళ దగ్గరనుంచి కొట్టేశారు. ఈ విధంగా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసినా, మెసేజ్ లు పంపినా, వాట్సాప్ కాల్ చేసినా అసలు భయపడొద్దు. వాటికి స్పందించవద్దు, అలాంటి మాటలు చెప్పగానే ఫోన్ కాల్ కట్ చేయాలి. 1930 కి ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ పై ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎవరు కూడా ఫోన్ లో దర్యాప్తును చేయరు, కేసు నుంచి తప్పిస్తామని డబ్బులు డిపాజిట్ చేయమని అడగరు. ఇది ప్రతి ఒకరు గుర్తించుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed