అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

by Sumithra |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
X

దిశ, వెల్గటూర్ : వెల్గటూరు మండలం ముక్క ట్రావుపేట గ్రామానికి చెందిన మేకల రాజు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతడి మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే కొద్ది రోజులుగా విడివిడిగా ఉంటున్న భార్య భర్తల మధ్య గొడవలు రాజు పై దాడికి ఉసిగొల్పాయా, లేదంటే తాగిన మైకంలో కింద పడి పోయి తీవ్ర గాయాలకు లోనయ్యడా, మరేదయినా జరిగిందా అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నాలుగు రోజులుగా రాజు తీవ్ర గాయాలకులోనై ప్రాణాలతో పోరాడుతూ వైద్యం అందక ఇంటిలోనే తుది శ్వాస విడిచారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వెల్గటూరు మండలం ముక్కట్రావు పేట గ్రామానికి చెందిన మేకల రాజు 36 అనే వ్యక్తిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కొండాపూర్ శాఖాపూర్ మధ్యలో ఉన్న బ్రిడ్జి సమీపంలో ఈ నెల 16న పట్టుకొని తీవ్రంగా కొట్టారని. అనంతరం ఆటోలో తెచ్చి రాత్రి అతడి ఇంటిలో పడేసి వెళ్ళగా వైద్యం అందక నాలుగు రోజులు ప్రాణాలతో పోరాడుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారనే ఓ వార్త మండలంలో షికారు చేస్తుంది.

వెల్లటూరు మండలం మొక్కట్రావుపేట గ్రామానికి చెందిన మేకల రాజుకు కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళతో కొంత కాలం క్రితం వివాహం జరిగింది. వారి కాపురం కొంత కాలం సవ్యంగానే సాగింది. దానికి గుర్తింపుగా ఇద్దరు కొడుకులు జన్మించారు. కొంత కాలానికి వారి వైవాహిక జీవితంలో మద్యం చిచ్చు పెట్టింది. మద్యానికి బానిసైన రాజు ఏ పని చేయకుండా తిరుగుతూ తరుచుగా భార్యతో డబ్బుల కోసం ఇంటిలో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గత 15 రోజుల క్రితం భర్తను విడిచి ఆమె తల్లి ఇంటికి వెళ్లింది. భార్యను కలిసి మాట్లాడి తిరిగి ఇంటికి తీసుకొద్దామని భర్త ఈ నెల 16న కొండాపూర్ గ్రామానికి వెళ్ళగా అక్కడ భార్య భర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. భార్య కాపురానికి రానని మొండికేయడంతో భర్త చేసేదేం లేక ఇంటికి బయలుదేరాడు.

ఈ క్రమంలో మార్గమధ్యలో శాఖాపూర్ వంతెన వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అటకాయించి దాడి చేసి తీవ్రంగా కొట్టారని, అదే రోజు రాత్రి సుమారు 7 గంటల సమయంలో దాడి చేసిన వ్యక్తులు ఇతన్ని ఆటోలో తెచ్చి ఇంటిలో పడేసి వెళ్లారని రాజు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే నిజమా లేదంటే తాగిన మైకంలో అదుపు తప్పి కింద పడటం వల్ల బలమైన దెబ్బలు తగిలాయా మరి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే విషయం తెలియడం లేదు. గాయాలతో ఉన్న ఇతని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా వైద్యం అందగా నాలుగు రోజులు ప్రాణాలతో పోరాడుతూ చివరికి తుది శ్వాస విడిచారు. రాజు మృతి పట్ల సరైన కారణాలు తెలియక పోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఆయన ఎలా చనిపోయాడు అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed