నీళ్లు అడిగితే వేలు కొరికిండు

by Sridhar Babu |
నీళ్లు అడిగితే వేలు కొరికిండు
X

దిశ,రామకృష్ణాపూర్ : నీటిని సరఫరా సరిగ్గా చేయమని అడిగినందుకు పంపు ఆపరేటర్ ఓ వ్యక్తి వేలును కొరికి గాయపరిచిన సంఘటన రామకృష్ణాపూర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ సింగరేణి ప్రాంతం అవడంతో సింగరేణి యాజామాన్యం కార్మికులకు రక్షిత మంచి నీరు సరఫరా చేస్తుంది. రామకృష్ణాపూర్ సింగరేణి సివిల్ విభాగంలో విధులు నిర్వహించే ఓ పంపు ఆపరేటర్ (జనరల్ మజ్దూర్) పట్టణంలోని బి.జోన్ సెంటర్, ఆర్.కే. ఫోర్ గడ్డ ప్రాంతానికి వాల్వ్​ ఓపెన్ చేసి నీటి సరఫరా చేస్తుండగా అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తి తమకు నీళ్లు సరిగా రావడం లేదని, ప్రెషర్ ఎక్కువ వచ్చే విధంగా వాల్వ్​ ను లూజ్ చేయాలని పంపు ఆపరేటర్ని కోరాడు. దాంతో వారి మధ్య వాగ్వాదం కాస్త గొడవకు దారి తీసింది.

ఇదే క్రమంలో కోపోద్రికుడైన పంపు ఆపరేటర్ సదరు వ్యక్తి వేలు కొరికి గాయపరిచి, కులం పేరుతో దూషించాడు. తనను గాయపరిచి, కులం పేరుతో దూషించిన పంపు ఆపరేటర్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. కాగా సదరు సింగరేణి ఉద్యోగి గతంలో స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించేవాడని, ఏరియా ఆసుపత్రిలో డ్రైవర్ లుగా విధులు నిర్వహించే దళిత వర్గానికి చెందిన వారితో సదరు ఉద్యోగి అసభ్యకరంగా మాట్లాడటం, వారి బట్టలను (శాలువాలు,చెద్దర్లు)కాళ్లతో తొక్కేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉద్యోగిపై పలు పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి. దాంతో వేరే ప్రాంతానికి బదిలీ చేశారని, అయినప్పటికీ డిప్టేషన్ పై ఇక్కడికి వచ్చాడని తెలిసింది.

Advertisement

Next Story