వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని హతమార్చారు....

by Sridhar Babu |
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని హతమార్చారు....
X

దిశ,కల్లూరు : ఈనెల 15న కల్లూరు నుంచి లక్ష్మీపురం వెళ్లే దారిలోని పుల్లపుకుంట చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఈ కేసు మిస్టరీ వీడింది. మృతురాలు చండ్రుగొండ మండలం మద్దికూరు గ్రామానికి చెందిన నారాయణపేట నరసమ్మ ( 52 )గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు వివరాలు వెల్లడించారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన భూక్య ప్రసాద్, ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా చెల్లాయపాలెం గ్రామానికి చెందిన మల్లేశ్వరి కలిసి నరసమ్మను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేశారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన భూక్య ప్రసాద్ కు సుమారు 20 సంవత్సరాల క్రితం పాయపూరు గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. 10 సంవత్సరాల క్రితం భార్యను వదిలివేసి ఒంటరిగా ఉంటూ కరెంటు పని చేసుకొని జీవిస్తున్నాడు.

కరెంటు పని నిమిత్తం నాలుగు సంవత్సరాల క్రితం కొత్తగూడెంకు వెళ్లగా అక్కడ నరసమ్మ అనే యువతి పరిచయం అయింది. అనంతరం ఆమెను పెళ్లిచేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రసాదు కరెంటు పని నిమిత్తం సంవత్సరం క్రితం నెల్లూరు వెళ్లగా చెల్లాయపాలెం గ్రామానికి చెందిన మల్లేశ్వరితో పరిచయం ఏర్పడింది. ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నరసమ్మ ప్రసాద్ తో గొడవ పడింది. గ్రామంలోని పెద్దలకు చెప్పి పంచాయితీ పెట్టి పరువు తీస్తానని బెదిరించింది. అయినా వినకపోవడంతో ప్రసాద్ పై నరసమ్మ కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. దాంతో మల్లేశ్వరి, ప్రసాద్ భయపడ్డారు. ఎప్పటికైనా నరసమ్మతో తమకు ఇబ్బంది అవుతుందని, ఆమెను హతమార్చాలని మల్లేశ్వరి, ప్రసాద్ పన్నాగం పన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 29న ప్రసాద్, మల్లీశ్వరి కల్లూరు వచ్చారు. మల్లేశ్వరి ముందుగా స్థానిక మామిడి తోటలో కాపుకాసి ఉండగా నరసమ్మను ప్రసాద్ ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. అక్కడ ఆమె తలపై ఆయుధంతో బలంగా కొట్టాడు.

ఆమె కిందపడిపోగానే మల్లేశ్వరి చీరతో ఉరివేసి హతమార్చారు. అనంతరం నరసమ్మ మృతదేహాన్ని గోనె సంచిలో వేసి మామిడి తోట పక్కన గల పుల్లపుకుంట చెరువులో పడేశారు. ఈ క్రమంలో ఈ నెల 15న పుల్లపుకుంట చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నరసమ్మ కనిపించకుండా పోయిందని గుర్తించారు. అనంతరం ప్రసాద్ ఇంటికి వెళ్లగా ఎవరూ లేకపోవడంతో ఆయన్ని పోలీస్​స్టేషన్​కు రమ్మనమని పోలీసులు గ్రామస్తులకు చెప్పి వెళ్లారు. అయినా ప్రసాద్​ రాకపోవడంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో భయపడిపోయిన ప్రసాద్, మల్లేశ్వరి ఆదివారం పోలీస్​స్టేషన్​లో లొంగిపోయారు. తామే హతమార్చామని నేరం ఒప్పకున్నారు. దాంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పెనుబల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్యను, ఎస్సై ఎస్కే షాకీర్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed