గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

by Sridhar Babu |
గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
X

దిశ, సత్తుపల్లి : వేంసూరు మండలంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వేంసూరు మండలం ఎర్ర గుంటపాడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మగ్గరు గ్రామానికి చెందిన రెడ్డి భాస్కరరావు(37) గత కొంతకాలంగా గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్ట్ పనులు చేపట్టిన కేఎంవీ కంపెనీ లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వేంసూరు మండలం ఎర్రగుంటపాడు, చౌడవరం గ్రామాల మధ్య పనులు చేస్తుండగా ఐరన్ రాడ్ కరెంటు తీగలకు తాకడంతో కరెంటు షాక్​ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు.

అది గమనించిన తోటి కార్మికులు వెంటనే సైట్ ఇంజనీర్ కు సమాచారం అందించి ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇవే పనుల్లో ఇప్పటి వరకు మండలంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నెల వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామ సమీపంలో మట్టిని తరలిస్తున్న టిప్పర్ అతివేగంగా మోటార్ సైకిల్ పైకి దూసుకెళ్లడంతో వ్యక్తి మృతి చెందాడు. సదరు కాంట్రాక్టర్ కంపెనీలో పనిచేసే కార్మికులకు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed