కుళ్లిన పదార్థాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌

by Sridhar Babu |
కుళ్లిన పదార్థాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌
X

దిశ, కుల్కచర్ల : కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ జిల్లాల వ్యాప్తంగా విక్రయించేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న తయారీదారుడితో పాటు ముగ్గురిని కుల్కచర్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, పరిగి డీఎస్‌పీ కరుణాసాగర్, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... చౌడాపూర్ మండల కేంద్రంలోని శశిధర్ కిరాణం దుకాణంలో కుళ్లిన పదార్థాలతో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలను తయారు చేసి అమ్ముతున్నారని నమ్మదగిన వ్యక్తుల సమాచారం మేరకు పోలీసులు సోదాలను నిర్వహించారు. షాపు యజమాని మహబూబ్ నగర్ కు చెందిన బాలకృష్ణ, వెంకటేశ్వర్లు వద్ద తీసుకుంటున్నానని తెలిపారు.

వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అతను కీసర మండలంలోని దామోదర్ రెడ్డి వద్ద తీసుకుంటున్నట్టు చెప్పారు. దామోదర్ రెడ్డిని విచారించి ముకుంద జింజర్ & గార్లిక్ పేస్ట్ ఇండస్ట్రీ పై దాడులు నిర్వహించి నాసిరకం అల్లం,వెల్లుల్లి పేస్ట్ తయారీకి ఉపయోగించే సిట్రిక్ యాసిడ్, ఏసిటిక్ యాసిడ్, టేస్టింగ్ సాల్ట్ లను 938 కేజీలు, 200 కేజీల ఎల్లిపాయలు మొత్తం 1138 కే‌జీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితులు శశిధర్, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, దామోదర్ రెడ్డిలను రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నకిలీ ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, కుల్కచర్ల సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story

Most Viewed