పీడీఎస్ రైస్ గోడౌన్ లో అగ్నిప్రమాదం..1000 క్వింటాళ్ల బియ్యం అగ్నికి ఆహుతి..

by Kalyani |
పీడీఎస్ రైస్ గోడౌన్ లో అగ్నిప్రమాదం..1000 క్వింటాళ్ల బియ్యం అగ్నికి ఆహుతి..
X

దిశ, జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్ శివారులో ఉన్న పత్తి మార్కెట్ యార్డ్ లో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ లో ఆదివారం మంటలు చెలరేగాయి. దీంతో గోడౌన్ లో నిల్వ ఉన్న 800 కింటాళ్లకు పైగా వివిధ కారణాలతో సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం, 100 కింటాళ్లకు పైగా రేషన్ దుకాణాల బియ్యం మంటల్లో కాలిపోయాయి. 70 వేలకు పైగా గన్నీ సంచులు కాలి బూడిదైనాయి.


కాలిపోయిన వాటిలో 13 వేల కొత్త గన్ని సంచులు ఉన్నాయి. దీంతో సుమారు రూ. 40 లక్షల ప్రభుత్వ ఆస్తి బుగ్గిపాలు అయింది. గోడౌన్ లో మంటలు అంటుకున్న విషయాన్ని గోడౌన్ కాంట్రాక్టర్ రమేష్ డీటీ కిషోర్ స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా సివిల్ సప్లై డీఎం ప్రవీణ్ ఉన్నతాధికారులతో సంప్రదించి గోడౌన్ గోడలను కూల్చేసి మంటలను ఆర్పేందుకు సుమారు నాలుగు గంటల నుంచి ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.


కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారాం ఘటన స్థలానికి చేరుకొని కాలిపోతున్న గోడౌన్ ని పరిశీలించారు. అక్కడ చేపడుతున్న సహాయక చర్యలను మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బంది చేపడుతున్న చర్యలను పరిశీలించి గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద నష్టాన్ని అంచనా వేసి సివిల్ సప్లై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫోన్ లో సమాచారం అందించారు. కాగా పక్కనే మరో గోడౌన్ ఉందని అందులో నియోజకవర్గానికి సప్లై అయ్యే రేషన్ బియ్యం స్టాక్ నిండుగా ఉందని ఈ మంటలు ఆ గోడౌన్ కు అంటుకొని ఉంటే మరింత నష్టం వాటిల్లేదని సివిల్ సప్లై అధికారులు తెలిపారు.


అగ్ని ప్రమాదం పై పలు అనుమానాలు..

జడ్చర్ల పట్టణంలో సివిల్ సప్లై గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా ప్రభుత్వ ఆస్తి నష్టం జరగడం పట్ల పలు అనుమానాలకు తావిస్తున్నాయి. గోడౌన్ లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు పరిసరాల్లో మంటలు సంభవించడానికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పీడీఎఫ్ బియ్యం వద్ద మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు తావిస్తోంది. బీడీ కాల్చిపడేయగా మంటలు చెలరేగాయా లేక ఎవరైనా కావాలనే గోడౌన్ లో మంటలు పెట్టారా అని పలు రకాలుగా ప్రజల చర్చించుకుంటున్నారు. కాగా ఈ ఘటనపై సివిల్ సప్లై అధికారులు లోతుగా సమగ్ర దర్యాప్తు చేపడితే గోడౌన్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed