నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

by Kalyani |   ( Updated:2023-06-05 15:10:10.0  )
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. వ్యక్తి అరెస్ట్
X

దిశ, శంషాబాద్: నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన సంఘటన షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా భీమవరంకు చెందిన తోటకూర రంగరావు పది సంవత్సరాల నుంచి కర్నూలులో పది ఎకరాల వ్యవసాయ పొలంలో పత్తి పంటను పండిస్తుంటాడు. ఇట్టి పత్తి పంటను సీడ్స్ కంపెనీలకు అమ్మేవాడు. అయితే ఆ కంపెనీ వారు సరైన ధర ఇవ్వకపోవడంతో తానే స్వయంగా విత్తనాలను తయారు చేసి అమ్మాలని ప్లాన్ చేసుకొని అందులో భాగంగానే 2018 సంవత్సరంలో తాను తయారు చేసిన నకిలీ పత్తి విత్తనాలను తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అమ్మగా అక్కడ రెండు కేసులు నమోదయ్యాయి.

ఆ కేసులలో జైలుకు కూడా వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వేరే పంటను తన పొలంలో వేయగా వాటి నుంచి సరైన లాభం రాలేదు. దీంతో తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మరల నకిలీ పత్తి విత్తనాలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ సంవత్సరం తన సొంత పొలం నాలుగు ఎకరాలతో పాటు కౌలు తీసుకున్న ఆరు ఎకరాలు కలిపి మొత్తం పది ఎకరాల్లో పండిన 25 క్వింటాళ్ల పత్తిని కర్ణాటకలోని జిమ్మింగ్ మిల్లులో ప్రొసీసింగ్ చేయించాడు. వాటి నుంచి వచ్చిన పత్తి విత్తనాలను 33 సంచుల్లో నింపుకొని కర్నూల్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పరిగిలో అమ్మడానికి రంగారావు బయలుదేరాడు.

ఈ క్రమంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయికల్ టోల్ గేట్ వద్ద ఉన్న రామేశ్వరం గేటు పక్కన రోడ్డుపై విత్తన సంచులతో పరిగి వెళ్లడానికి సిద్దంగా ఉండగా పక్క సమాచారంతో ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్లి ఎస్ఓటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఇట్టి విత్తనాల సంచులపై ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోవడం, అలాగే గడువు తేదీ లేకపోవడంతో వీటిని విత్తన చట్టం 1983 ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. 33 సంచులలో ఉన్న 1518 కిలోల నకిలీ పత్తి విత్తనాల విలువ మార్కెట్లో రూ. 40 లక్షల వరకు ఉంటుందన్నారు నిందితుడు రంగారావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఏసీపీ కుశాల్కర్, ఎస్ఓటీ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, షాద్ నగర్ అగ్రికల్చర్ ఆఫీసర్ నిషాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed