అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బిడ్డను బలిగొన్న వైద్యుల పైశాచికం..

by Kalyani |
అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బిడ్డను బలిగొన్న వైద్యుల పైశాచికం..
X

దిశ, అచ్చంపేట: ఓ పక్క పురిటినొప్పులు మరో పక్క నర్సుల పైశాచికత్వం వెరసి పండంటి బిడ్డ పరలోకానికి వెళ్లింది. సాధారణ సుఖ ప్రసవం కోసం కొండంత ధైర్యాన్ని ఇస్తూ వైద్య చిట్కాలతో నిండు చూలాలుకు ప్రసవం జరపాల్సిన సిబ్బంది సూదుల్లాంటి మాటలతో పాటు శరీరంపై వాతలు వచ్చేలా కొడుతూ నిండు గర్భిణిని చిత్రహింసలకు గురిచేశారు. చివరకు బిడ్డ మృతికి కారణమయ్యారు. ఈ అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

పదరా మండల కేంద్రానికి చెందిన మంజుల (25) మొదటి కాన్పుగా బుధవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు, వైద్య సిబ్బంది సాధారణ ప్రసవం జరుగుతుందని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో నొప్పులు అధికం కావడంతో సమయానికి వైద్యురాలు డ్యూటీలో లేకపోవడంతో సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. గర్భిణీ తన శక్తికి మించి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో డ్యూటీ నర్సులు విచక్షణ మరచి చేతులు, కాళ్లపై ముఖంపై బాదుతూ చిత్రహింసలకు పాల్పడినట్లు బాలింత మంజుల ఆరోపించింది.

చివరకు పొత్తికడుపుపై తమ శక్తినంతా ప్రయోగించడంతో బిడ్డ మృతి చెందిందని తెలిపారు. కానీ వైద్యులు మాత్రం బిడ్డను హైద్రాబాద్ తరలించి డ్రామా చేశారని ఆరోపించారు. మొత్తంగా వైద్య సిబ్బంది మానవత్వాన్ని మరచి గర్భిణిని చిత్ర హింసలకు గురిచేసి తన బిడ్డ చావుకు కారణమయ్యారని బాధితులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు అర్ధరాత్రి వరకు ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed