ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు అప్పులే కారణమా.. ?

by Sumithra |   ( Updated:2024-12-29 15:34:41.0  )
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు అప్పులే కారణమా.. ?
X

దిశ, గంభీరావుపేట : కుటుంబంతో సహా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకోగా కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే సిద్దిపేట జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ (34) ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కానిస్టేబుల్ స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో బాలకృష్ణ మృతి చెందగా, భార్య మానస, కుమారులు యశ్వంత్, అశ్విత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందుగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బాలకృష్ణ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం లింగన్నపేటకు తీసుకువచ్చారు.

బాలకృష్ణ సిరిసిల్ల 17 బెటాలియంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బాలకృష్ణ 10వ తరగతి లింగన్నపేటలో, ఇంటర్ ముస్తాబాద్ లో, డిగ్రీ వరకు కామారెడ్డిలో చదివాడు. దాదాపు 12 సంవత్సరాల క్రితం ఏఆర్ కానిస్టేబుల్ గా బాలకృష్ణ సెలెక్ట్ అయ్యాడు. మొదట్లో ముస్తాబాద్ లో, అక్కడి నుండి హైదరాబాదులో, తర్వాత 17వ బెటాలియన్ సిరిసిల్లకు వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. బాలకృష్ణ తల్లిదండ్రులు రాజు, మల్లవ్వ స్వగ్రామైన లింగన్నపేటలో ఉండగా, బాలకృష్ణ తన భార్య పిల్లలతో కలిసి సిద్దిపేటలో ఉంటున్నాడు. బాలకృష్ణకు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. కొన్నేల్ల క్రితం బాలకృష్ణ సిద్దిపేటలో ఇల్లు కొనుగోలు చేశారు.

ఇల్లు కోసం బాలకృష్ణ పెద్ద మొత్తంలో అప్పులు చేశాడని, కిస్తీలకు సంబంధించి ఈఎంఐ కట్టలేని పరిస్థితి నెలకొందని కుటుంబ సభ్యలు తెలిపారు. అప్పుల వత్తిళ్లు బాలకృష్ణకు పెరగడంతో భార్య బిడ్డలతో అప్పులు అంశాన్ని తరచూ చర్చిస్తూ మనోవేదనకు గురయ్యేవాడన్నారు. ఎప్పటికైనా ఈ అప్పులు కట్టలేమని నిర్ణయించుకొని బాలకృష్ణ కుటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.

బాలకృష్ణ అక్కడే మృతిచెందగా, భార్య, ఇద్దరు కుమారులను సమీప బంధువులు, ప్రజలు ముందుగా సిద్దిపేట, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ మృతదేహాన్ని అతడి తమ్ముడు రాము వచ్చేవరకు ఉంచనున్నారు. తమ్ముడు రాము ఉపాధి కోసం బెహరాన్ లో ఉంటున్నాడు. బాలకృష్ణ దహన సంస్కారాలు సోమవారం జరగనున్నాయి. బాలకృష్ణ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం, భార్యాబిడ్డలు హైదరాబాద్ ఆస్పత్రిలో ఉన్న విషాద సంఘటన తలుచుకుంటూ బంధువులు రోధించడం అందరి మనసులను కలచివేసింది.

Advertisement

Next Story