ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చిన తనయుడు

by Shiva |
ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చిన తనయుడు
X

భార్య, స్నేహితుడి సహకారంతో హతమార్చిన వైనం

దిశ, ఎల్లారెడ్డి (నాగిరెడ్డిపేట్) : ఆస్తి కోసం కన్న తండ్రిని కట్టుకున్న భార్య సహకారంతో కన్నకొడుకును బుధవారం ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు హత్యకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని కుమార్ బేస్ లో నివాసముంటున్న జాడే తుకారాం 14 తన ఇంట్లో చనిపోయినట్లు మృతుడి కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని సీఐ శ్రీనివాస్ నాయకత్వంలో ఎస్సై గణేష్ రెండు బృందాలుగా ఏర్పడి కేసులో దర్యాప్తు చేపట్టారు. హంతకుల కోసం మాటు వేసి బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారిస్తే నేరం చేశామని ఒప్పుకున్నారని తెలిపారు. అదేవిధంగా హంతకుల నుంచి రూ.1.50 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన జాడే తుకారాం కొడుకు జాడే బాలకృష్ణ ఆలీయస్ కిషోర్ తండ్రి ఆస్తి విషయంలో గత కొన్ని నెలలుగా గొడవ పడుతున్నారు. మృతుడు జాడే తుకారం కొడుకు జాడే బాలకృష్ణ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని చంద్రగిరి కాలనీ, తిరుమలగిరి ప్రాంతాల్లో వ్యాపారం చేస్తూ కరోన సమయంలో నష్టపోయి షాప్ ఎత్తివేశాడు. అనంతరం అప్పటి నుంచి తండ్రి జాడే తుకారాంతో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కిషోర్ తన తండ్రిని ఆస్తిలో తన వంతు వాటా ఇవ్వమని అడగగా ఇవ్వనని చెప్పడంతో ఆ రోజు నుంచి తండ్రిపై కక్ష గట్టి ఎలాగైనా తన తండ్రిని అడ్డు తొలగించుకోని ఆస్తిని చేజిక్కించుకోవాలని పథకం పన్నాడు.

ఈనెల 13న హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన ఎల్లారెడ్డికి భార్య జాడే శిల్పతో కిషోర్ ఎల్లారెడ్డి వచ్చాడు. హత్య విషయంలో తనకు సహకరించాలని తన చిన్ననాటి స్నేహితుడైన రాజు ఎలిషా ఇంటికి వెళ్లగా అతను డబ్బుకు ఆశ పడి ఒప్పందం కుదర్చుకున్నాడు. అదే రోజు రాత్రి ఎల్లారెడ్డిలోని కుమార్ బేస్ లో నివసిస్తున్న తన తండ్రి జాడే తుకారాం ఇంటికి వెళ్లి తుకారాంను ఇరువురు కలిసి చేతులతో గుద్ది, కాళ్లు చేతులు కట్టేసి తలను నేలకేసి కొట్టి చంపారు. అనంతరం రాజు ఎలిషా తన ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న శిల్పను బైక్ పై ఎక్కించుకుని తుకారాం ఇంటికి తీసుకొచ్చాడు.

అక్కడ మృతుడిపై పడిన రక్తపు మరకలను కోడలు జాడే శిల్ప బట్టతో తుడిచి మృతుడు కట్టుకున్న బట్టలను విప్పేసి ఆ బట్టలను ఇంటి వెనకాల కాల్చేసినట్లు పోలీసుల ఎదుట జాడే శిల్ప ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేష్ ను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. వారికి సహకరించిన సిబ్బంది రాము, లికియా నాయక్, మహేష్, వీరప్రసాద్, హోంగార్డ్ కు ప్రత్యేకంగా ఎస్పీ గారి గైడెన్స్ తో రూ.500 రివార్డు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story