ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి శవమై దొరికాడు

by Sridhar Babu |
ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి శవమై దొరికాడు
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని సంజీవరెడ్డి పాలెం గ్రామ శివారులో బుధవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బూర్గంపాడు గ్రామపంచాయతీ పరిధిలోని గౌతపురం కాలనీకి చెందిన మారబోయిన రమేష్(50) అనే వ్యక్తి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేష్ తిరిగి రాలేదు.

బుధవారం సంజీవరెడ్డిపాలెం గ్రామ శివారులో రోడ్డు పక్కన పడి ఉన్న మృతుడిని గమనించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పాల్వంచ సీఐ వినయ్ కుమార్, ఎస్ఐలు రాజేష్, నాగభిక్షం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతుడి తలకు తీవ్ర గాయాలై ఘటన స్థలంలో మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య గంగ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Next Story