చిచ్చురేపిన భూ వివాదం.. గద్వాల పట్టణంలో ఇరువురు పరస్పర దాడులు

by Kalyani |
చిచ్చురేపిన భూ వివాదం.. గద్వాల పట్టణంలో ఇరువురు పరస్పర దాడులు
X

దిశ, గద్వాల ప్రతినిధి: ఓ భూమి వివాదం ఇరువర్గాల మధ్య చిచ్చురేపింది. గద్వాల పట్టణంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇరువురు పరస్పర దాడులు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. భూ వివాదం విషయంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు సుమారు ఇరవై మందికి పైగా వచ్చి ఓ ప్రైవేట్ హోటల్ లో భోజనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు ధరూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై మంగళవారం మధ్యాహ్నం భౌతిక దాడి చేసి త్రీవంగా గాయపరిచారు.

ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు భారీగా గద్వాల పట్టణంలో గల నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయానికి చేరుకొని నిరసన చేపట్టడంతో పాటు కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న కొందరి కార్యకర్తల పై భౌతిక దాడి చేసి గాయపరిచారు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కొందరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. గాయపడిన శ్రీనివాస్ రెడ్డి నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయం ఎదుట బైఠాయించి తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కాగా ఇదే అదునుగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు సమితి నాయకుడు గొంగల్ల రంజిత్ ఉన్న అపార్ట్ మెంట్ లోెని ఇంటికి వెళ్లి ఆయన వ్యక్తిగత వాహనంపై దాడి చేసి ఇంటి పైకి వెళ్ళారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించి తిరిగి పంపడం జరిగింది. ఇలా ఒక పొలం పంచాయితీలో ఇరువురు తమ అంగ బలం ప్రదర్శించారు. ఈ ఘటనతో నగరంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని పల్లెలో ప్రతి దాడులు జరిగే అవకాశం ఉండడంతో డీఎస్పీ రంగ స్వామి, సీఐ చంద్ర శేకర్ కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story