ఆ దేశాల్లో ఆడకున్నా.. అంతర్జాతీయ క్రికెటర్లయ్యారు !

by Shyam |   ( Updated:2020-04-30 06:06:55.0  )
ఆ దేశాల్లో ఆడకున్నా.. అంతర్జాతీయ క్రికెటర్లయ్యారు !
X

దిశ, స్పోర్ట్స్: ఏ ఆటైనా ఒంటరిగా ఆడుకునేందుకు వీలు కాదు. గోల్ఫ్ నుంచి బ్యాడ్మింటన్ వరకు.. హాకీ నుంచి క్రికెట్ వరకు ఏ ఆట ఆడాలన్నా ప్రత్యర్థి ఉండాల్సిందే. సరదాగా గల్లీలో క్రికెట్ ఆడాలన్నా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. అంటే ఆ ఆట తెలిసిన మరో వ్యక్తి తప్పనిసరి. అయితే, క్రికెట్ ఊసేలేని.. అసలు ఆ ఆట గురించే ఓనమాలే తెలియని దేశాల్లో పుట్టి అంతర్జాతీయ క్రికెట్ ఆడే స్థాయికి ఎదిగిన క్రికెటర్లు కూడా ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.

1. అశోక్ గందోత్రా

బ్రెజిల్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఫుట్‌బాల్. ఇండియాలో క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఎలానో.. బ్రెజిల్‌లో సాకర్‌కు అంత క్రేజ్. అలాంటి దేశంలో పుట్టాడు అశోక్ గందోత్రా. అతడి తండ్రి బ్రెజిల్‌లోని భారతీయ దౌత్య కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడే కొంత కాలం పెరిగిన అశోక్.. తర్వాత కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చారు. ఇక్కడకు వచ్చాకే అతనికి క్రికెట్ పరిచయమైంది. క్రమంగా ఆటపై మక్కువ పెంచుకున్న అశోక్.. క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. 21 ఏండ్ల వయస్సులోనే భారత జట్టుకు ఎంపికై రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు కలిగిన అశోక్.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తన ఫామ్ కొనసాగించలేకపోవడంతో జట్టులో స్థానం నిలుపుకోలేక పోయాడు.

2. టెడ్ డెక్స్‌టర్

ఇటలీ అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ఫార్ములా వన్. ఆ తర్వాతే ఫుట్‌బాల్, టెన్నిస్. ఆ దేశంలో క్రికెట్ గురించి ఆలోచించే వాళ్లు అరుదు. కానీ మిలాన్‌లో పుట్టిన టెడ్ డెక్స్‌టర్‌కు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా క్రికెట్ జట్టులో తానూ ఒక సభ్యుడిగా ఉండాలని కలలు కనేవాడు. కానీ, టెడ్ ఏకంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యాడంటే ఊహించగలమా..? అవును తన కలలు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఇంగ్లాండ్ చేరుకున్న టెడ్ అక్కడి కౌంటీ క్రికెట్‌లో భాగమయ్యాడు. 327 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 43 లిస్ట్ ఏ మ్యాచులు ఆడిన టెడ్ మొత్తం 22,359 పరుగులు చేశాడు. ఇక 62 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టెడ్ 9 సెంచరీలు, 27 అర్థ సెంచరీలతో 4502 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానం అంటే టెడ్‌కు అత్యంత ఇష్టం. ఆ గ్రౌండ్‌లో మ్యాచ్ అంటే పూనకం వచ్చిన వాడిగా ఊగిపోయేవాడు. అక్కడ అద్భుతమైన రికార్డు ఉంది. అందుకే టెడ్‌ను ముద్దుగా ‘లార్డ్ టెడ్’ అని పిలుచుకునే వాళ్లు.

3. డొనాల్డ్ కార్, పాల్ టెర్రీ

జర్మీనీలోనూ పుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్. అక్కడ ఏ గ్రౌండ్ చూసినా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తుంటారు. అలాంటి దేశంలో పుట్టిన ఇద్దరు మాత్రం క్రికెట్‌ను తమ కెరీర్‌గా ఎంచుకొని రాణించారు. డొనాల్డ్ కార్, పాల్ టెర్రీలు జర్మనీలో పుట్టి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. డొనాల్డ్ కార్ జర్మనీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 1951లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడాడు. అతను ఆడిన తొలి మ్యాచ్ ఇండియా పైనే. ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టును నడిపించిన డొనాల్డ్.. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 85 పరుగులు చేశాడు. ఇండియా మీద మ్యాచ్ ఒడిపోయిన తొలి ఇంగ్లాండ్ కెప్టెన్‌గా రికార్డుల కెక్కాడు. దీంతో ఆ తర్వాత సెలెక్టర్లు డొనాల్డ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు.

ఇక పాల్ టెర్రీ 1984లో ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ సరైన ఫామ్ లేకపోవడంతో జట్టులో ఎక్కువ కాలం కొనసాగలేదు. కాని ఇద్దరూ కౌంటీ క్రికెట్‌లో మాత్రం అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు.

4. డిక్ వెస్ట్‌కాట్

క్రిస్టియానో రొనాల్డొ వంటి గ్రేట్ సాకర్ ప్లేయర్లు పుట్టిన పోర్చుగల్‌లో డిక్ వెస్ట్ కాట్ జన్మించాడు. లిస్బన్‌లో పుట్టిన ఇతను సౌత్ ఆఫ్రికా జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన వెస్ట్ కాట్ 166 పరుగులు సాధించాడు. అతని బెస్ట్ స్కోర్ 66. ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డిక్ వెస్ట్‌కాత్ తన 85వ ఏట మరణించాడు.

5. మోసెస్ హెన్రిక్స్

ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న మోసెస్ హెన్రిక్స్ పుట్టింది పోర్చుగల్‌లోని ఫన్‌చల్ నగరంలో. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్నా.. ఎక్కువ కాలం ఆ స్థానాన్ని నిలపుకోలేక పోయాడు. కానీ ఐపీఎల్, బీబీఎల్‌లో పలు ఫ్రాంచైజీల తరపున క్రికెట్ ఆడాడు. 2009లో ఆస్ట్రేలియా జట్టులో స్థానం దక్కించుకొని 4 టెస్టులు, 11 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 404 పరుగులు 13 వికెట్లు తీశాడు. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా ఈ ఏడాది టైటిల్ సాధించిపెట్టాడు.

Tags : Cricket, ICC, India, Australia, BBL, IPL, Brazil, Italy, Germany, England

Advertisement

Next Story

Most Viewed