- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువ టాలెంట్.. బెంచ్‌కే పరిమితం
దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ నిర్వహించే క్యాష్ రిచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం 14వ సీజన్ ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ అంటే కేవలం డబ్బే అని అందరూ భావిస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఈ లీగ్ ద్వారా క్రికెటర్లు, బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్లు డబ్బు సంపాదిస్తున్నారన్నది నిజమే. మరోవైపు ఎంతో మంది యువ క్రికెటర్లు ఈ లీగ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారని బీసీసీఐ చెబుతున్నది. జస్ప్రిత్ బుమ్రా, పాండ్యా బ్రదర్స్, నటరాజన్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ వంటి క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా గుర్తించబడ్డారని అందరూ చెబుతున్నారు. ఇది నిజమే.. కానీ మరెంతో మంది యువ క్రికెటర్లు సీజన్ల పాటు బెంచ్‌లకు పరిమితం అయ్యారు. యువకులను ప్రోత్సహించాలని ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసినా.. వారికి తుది జట్టులో అవకాశాలు మాత్రం దొరకడం లేదు. అలా చాలా కాలంపాటు వెలుగులోకి రాకుండా ఉండిన క్రికెటర్లు ఐపీఎల్ వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
బాబా అపరాజిత్
తమిళనాడుకు చెందిన ఈ ఆటగాడు 2012లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ వరల్డ్ కప్‌ను ఇండియా అండర్ 19 జట్టు గెలుచుకోవడంతో బాబా అపరాజిత్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ 2013లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అతడిని జట్టులోకి తీసుకున్నది. ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చిన సీఎస్కే.. బాబా అపరాజిత్ విషయంలో మాత్రం సరిగా వ్యవహరించలేకపోయింది. 2013 నుంచి 2015 వరకు మూడు సీజన్ల పాటు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత ఏడాది సీఎస్కేపై బ్యాన్ విధించారు. అయితే 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసింది. 2016, 2017లో కూడా పూణే తరపున బెంచ్‌కు పరిమితం అయ్యాడు. మొత్తం 5 సీజన్ల పాటు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్ మీద ఉన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన బాబా అపరాజిత్.. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర క్రికెటర్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
సిద్దేశ్ లాడ్
ముంబైకి చెందిన సిద్దేశ్ లాడ్ రంజీ ట్రోఫీలో మంచి బ్యాట్స్‌మాన్‌గా రికార్డు ఉన్నది. అతడి నిలకడైన ఆటతీరు గమనించిన ముంబై ఇండియన్స్ జట్టు 2015లో కొనుగోలు చేసింది. అయితే 2019 వరకు సిద్దేశ్ లాడ్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు. ప్రతీ సీజన్‌లో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ముంబై జట్టులో స్టార్ క్రికెటర్లు ఉండటంతో లాడ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2019లో రోహిత్ శర్మ గాయపడటంతో ఒక మ్యాచ్‌లో సిద్దేశ్‌కు ఆడే అవకాశం కల్పించారు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన లాడ్ 15 పరుగులు చేశాడు. కానీ గత ఏడాది ముంబై ఇండియన్స్ అతడిని వేలం సమయంలో విడుదల చేసింది. లాడ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటికీ అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇలా ఏళ్లకేళ్లు ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆడకుండా డగౌట్‌లో కూర్చొని మ్యాచ్‌లు చూస్తూ గడిపేస్తున్నాడు.
సందీప్ వారియర్
కేరళకు చెందిన కుడిచేతి పేసర్ సందీప్ వారియర్. 2012 నుంచి గోవా జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సత్తా ఉన్న ఏకైక బౌలర్ సందీప్ వారియర్. కేరళ తరపున ఫస్ట్ క్లాస్‌లో 100కు పైగా వికెట్లు తీశాడు. అతడి టాలెంట్ చూసి 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కొనుగోలు చేసింది. కానీ మూడు సీజన్ల పాటు బెంచ్‌పై ఉంచుకున్న ఆర్సీబీ.. 2016లో విడుదల చేసింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు మరే జట్టు అతడిని కొనుగోలు చేయలేదు. ప్రతీ సీజన్‌లో ఆక్షన్‌కు వచ్చినా అన్‌సోల్డ్ ప్లేయర్‌గానే మిగిలిపోయాడు. 2019లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసింది. ఎట్టకేలకు ఐపీఎల్‌లో అడుగుపెట్టిన 6 ఏళ్ల తర్వాత సందీప్ వారియర్‌కు అవకాశం వచ్చింది. కానీ ఆ సీజన్ మొత్తం ఓకే మ్యాచ్ ఆడించిన కేకేఆర్ తర్వాత అతడిని పక్కన పెట్టింది.
షెల్డన్ జాక్సన్
సౌరాష్ట్రకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ షెల్డన్ జాక్సన్ 2012 దేశవాళీ క్రికెట్‌లో అద్బుత ప్రదర్శన చేశాడు. ఆ ఏడాది సౌరాష్ట్ర తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో రెండో స్థానవంలో నిలిచాడు. దీంతో 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడిని కొనుగోలు చేసింది. అతడిని ఒక్క మ్యాచ్ ఆడించకుండానే తర్వాత ఏడాది విడుదల చేసింది. 2015లో కోల్‌కతా నైట్ రైడర్స్ షెల్డన్ జాక్సన్‌ను కొనుగోలు చేసి రెండేళ్ల పాటు బెంచ్‌కే పరిమితం చేసింది. 2017లో నాలుగు మ్యాచ్‌లు ఆడించిన తర్వాత ఆ ఏడాది కేకేఆర్ విడుదల చేసింది. 2018లో అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు. కాగా, తాజాగా జరిగిన వేలంలో షెల్డన్‌ను కేకేఆర్ జట్టే కొనుగోలు చేయడం విశేషం. 2013 నుంచి ఐపీఎల్‌లో ఉంటున్నా.. షెల్డన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీనికి కారణం ఆయా జట్లలో ఉన్న పరిమితులే. వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ అయిన జాక్సన్‌కు అవకాశం ఇవ్వాలంటే అప్పటికే జట్టులో ఉన్న కీపర్లను తొలగించాలి. అందుకే అతడిని బెంచ్‌కే పరిమితం చేశాయి.
ఈ నలుగురు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు కలిగిన క్రికెటర్లు. స్వయంగా రాహుల్ ద్రవిడ్ వీరి టాలెంట్ గురించి పలుమార్లు చెప్పాడు. అయితే ఆయా జట్లు వీరిని కొనుగోలు చేసినా అవకాశాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరించడంతో వెలుగులోకి రాకుండా పోయారు. అయితే అదే సమయంలో 2 నుంచి 3 సీజన్ల పాటు బెంచ్‌పై ఉన్న పలువురు క్రికెటర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెలుగులోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ కేకేఆర్ తరపున 3 సీజన్ల పాటు బెంచ్‌పై ఉన్నాడు. టి. నటరాజన్ పంజాబ్ కింగ్స్ తరపున 2 సీజన్లు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మహ్మద్ సిరాజ్ ఆర్సీబీ తరపున చాలా కాలం డగౌట్‌కు పరిమితం అయ్యాడు. కానీ సరైన సమయంలో తమను తాము నిరూపించుకున్నారు.