క్రికెట్‌పై సన్నాహాలు..కండిషన్స్ అప్లై

by vinod kumar |
క్రికెట్‌పై సన్నాహాలు..కండిషన్స్ అప్లై
X

దిశ, స్పోర్ట్స్ :
కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన క్రికెట్‌ సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సన్నాహాలు చేస్తోంది. ఆటగాళ్లు, అంపైర్లు, సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త నిబంధనలు అమలులోకి తేనుంది. దీనిపై ఇప్పటికే ఐసీసీ పూర్తిస్థాయిలో చర్చిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆట ఆడే సమయంలో ఆన్‌ఫీల్డ్, ఆఫ్‌ఫీల్డ్‌కు సంబంధించి పలు నిబంధనలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

అంపైర్లకు గ్లోవ్స్..

మైదానంలో క్రీడాకారులు తప్పకుండా భౌతికదూరం పాటించాలని ఐసీసీ చెబుతోంది. అంతేకాకుండా అంపైర్లు తప్పకుండా గ్లౌవ్స్ ధరించాలని, ఆటగాళ్లు కూడా తమకు సంబంధించిన క్యాప్స్, సన్ గ్లాసెస్, స్వెటర్లు అంపైర్లకు ఇవ్వరాదని ఐసీసీ చెబుతోంది. బంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంపైర్లు నేరుగా చేతులతో తాకొద్దని అంటోంది. ఇక క్రికెటర్లు కూడా బంతిని పట్టుకున్న ప్రతిసారి శానిటైజర్లు ఉపయోగించాలని ఐసీసీ నిబంధన విధించింది. ప్రతి ఒక్కరి జేబులో మినీ శానిటైజర్ బాటిల్స్ ఉంచుకోవాలని చెబుతోంది. ఈ నిబంధనలు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లకే కాకుండా దేశవాళి, క్లబ్ క్రికెట్, ఐపీఎల్ వంటి లీగ్స్‌కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక మైదానంలో ఆటగాళ్లు 1.5 మీటర్ల భౌతికదూరం పాటించాలని, స్థానిక ప్రభుత్వాలు కాబట్టి ఇంకా ఎక్కువ దూరం సూచిస్తే ఆ మేరకు దూరం పాటించాలని చెప్పింది. ఆటగాళ్లు గుంపులుగా గుమికూడవద్దని, వికెట్లు తీసినప్పుడు ఒకరిని మరొకరు తాకొద్దని ఐసీసీ సూచిస్తోంది. చీటికిమాటికి అంపైర్ల వద్దకు వెళ్లకూడదని ఐసీసీ హెచ్చరించింది.

గెలుపు సంబరాలు..

ఆట ముగిసిన తర్వాత విజయోత్సవాలు నిర్వహించొద్దని, ఒకవేళ నిర్వహించినా ఒకరు తాగిన డ్రింక్ బాటిల్ మరొకరు తాగొద్దని చెప్పింది. కౌగిలించుకొని సంబురాలు అస్సలు చేసుకోవద్దని ఐసీసీ అంటోంది. డ్రెస్సింగ్స్ రూమ్స్‌లో కూడా ఒకరి వస్తువులు మరొకరు తాకడం, టవల్స్, నాప్కిన్స్ వంటివి షేర్ చేసుకోవడానికి ఐసీసీ నిషేధించింది. బంతి ద్వారానే కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు లాలాజలం ఉపయోగించి షైన్ చేయవద్దని ఐసీసీ కోరింది. అంతగా అవసరమైతే చెమటను ఉపయోగించుకోమని సూచించింది.

వారికి నో ఛాన్స్..

ప్రస్తుతం అంపైరింగ్, రిఫరీ, ఇతర ఆఫ్‌ఫీల్డ్ పనుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వాళ్లే ఉంటున్నారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ఇకపై వారి సేవలను సాధ్యమైనంతగా తగ్గించాలని ఐసీసీ భావిస్తోంది. ఒకవేళ తప్పనిసరిగా వారి సేవలు ఉపయోగించుకోవాల్సి వస్తే స్థానిక క్రికెట్ బోర్డు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. తక్కువ వయసు వారినే అంపైర్లుగా నియమించాలని కూడా ఐసీసీ భావిస్తోంది. ప్రతిరోజూ ఆటగాళ్లకు, సిబ్బందికి, అంపైర్లు, రిఫరీలకు కొవిడ్ – 19 పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే ఆ మ్యాచ్ రద్దు చేసి, ఆటగాళ్లందరినీ క్వారంటైన్‌కు పంపాలని సూచించింది. ఇన్ని నిబంధనల మధ్య ఆట ముందులా మజాగా ఉంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆటగాళ్లను కరోనా నుంచి రక్షించాలంటే ఈ నిబంధలను పాటించాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed