ఆట లేదు.. డబ్బు రాదు.. ఇబ్బందుల్లో రంజీ క్రికెటర్లు

by Shyam |
ఆట లేదు.. డబ్బు రాదు.. ఇబ్బందుల్లో రంజీ క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో క్రికెట్‌ను వృత్తిగా చేసుకొని ఆడుతున్న వాళ్ల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. అయితే అందులో బీసీసీఐ పరిధిలో ఆడే క్రికెటర్లు దాదాపు వెయ్యి మంది ఉంటారు. సీనియర్ పురుషుల, మహిళల, అండర్ 19 క్రికెటర్లను పక్కన పెడితే.. మిగిలిన దాదాపు 800 మంది దేశవాళీ క్రికెట్ ఆడుతారు. ఇండియాలో ఒక క్రికెటర్ ఏదైనా రాష్ట్ర జట్టు లేదా క్రికెట్ అసోసియేషన్ తరపున ఒక సీజన్ ఆడితే దాదాపు రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు సంపాదిస్తాడు. ఇలా సంపాదించే క్రికెటర్లలో దాదాపు 700 మందికి క్రికెటే జీవనోపాధి. అంటే వీళ్లు బయట ఎక్కడా ఉద్యోగాలు చేయరు.. ఇతరత్రా పనులు చేసే టాలెంట్ కూడా ఉండదు. కేవలం క్రికెట్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఏడాది పొడవునా ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడి కుటుంబాన్ని పోషించుకుంటున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కరోనా ముందు వరకు కూడా వీరి జీవితాలన్నీ సాఫీగానే నడిచాయి. కానీ కరోనా దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే కాకుండా దేశవాళీ క్రికెట్ కూడా ఆగిపోవడంతో వందలాది మంది క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు కూడా రావడం లేదు. రంజీ క్రికెట్ చరిత్రలో 87 తర్వాత తొలి సారిగా 2020లో సీజన్ రద్దు చేశారు. దీంతో ఎంతో మంది దేశవాళీ క్రికెటర్లకు వేతనాలు లేకుండా పోయాయి.

క్రికెటర్ల వెతలు..

గత సీజన్ రద్దు కావడంతో దేశవాళీ క్రికెటర్లకు రావాల్సిన మ్యాచ్ ఫీజులు కూడా ఆగిపోయాయి. అంతే కాకుండా రంజీ ట్రోఫీని రద్దు చేసే ముందే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెటర్లందరికీ పరిహారం చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇటీవల జరిగిన బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో కూడా ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీహార్, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రికెటర్లు చాలా మంది డబ్బులేక స్థానికంగా దొరికే ప్రైవేటు జాబ్స్‌కు వెళ్తున్నారు. ఢిల్లీకి చెందిన దృవ్ (28) ఇప్పటికే విలువైన సమయాన్ని కోల్పోతున్నాడు. క్రికెట్ లేకపోవడంతో ఇంట్లో జరుగుబాటు లేకుండా పోయింది. అయితే సమయానికి అతడికి స్పోర్ట్స్ కోటాలో ఆర్బీఐలో జాబ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక రాజస్థాన్‌కు చెందిన అనికేత్ చౌదరి కొవిడ్ కారణంగా తన నానమ్మను పోగొట్టుకున్నాడు. ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు కూడా కొవిడ్ బారిన పడ్డారు. కానీ రంజీ ద్వారా రావాల్సిన డబ్బు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడటంతో కొంత డబ్బు వచ్చింది. దీంతోనే కుటుంబ సభ్యులకు వైద్యం చేయించడంతో పాటు ఇంటిని నడుపుతున్నాడు. ఇక విదర్భ కెప్టెన్ ఫయాజ్ ఫజల్ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చెబుతున్నాడు. రంజీ సీజన్ రద్దు కావడంతో ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు చాలా కష్టాలు పడుతున్నారని అన్నాడు. ‘తాను కనీసం ఐపీఎల్ కూడా ఆడటం లేదు. అందుకే డబ్బుకోసం యూకే వచ్చి క్లబ్ క్రికెట్ ఆడి.. వచ్చిన డబ్బును ఇంటికి పంపుతున్నాను’ అని చెబుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా బీసీసీఐ ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎంతో మంది క్రికెటర్లు ఆర్థిక కష్టాలతో కుంగిపోతారని చెబుతున్నాడు.

కాంట్రాక్టులు ఇవ్వండి..

బీసీసీఐ కేవలం అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లకే కాంట్రాక్టులు ఇస్తుంది. మిగతా వాళ్లు ఆయా రాష్ట్రాల అసోసియేషన్ల పరిధిలోనే ఆడతారు. అసోసియేషన్లు ఆయా క్రికెటర్లు ఆడిన మ్యాచ్‌లకు సంబంధించిన ఇన్వాయిస్‌లను తయారు చేసి పంపితే బీసీసీఐ డబ్బులు జమచేస్తుంది. గత ఏడాది లాగా సీజన్ రద్దయితే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు రావు. గత ఏడాది అంతర్జాతీయ మ్యాచ్‌లు రద్దయినా బీసీసీఐ కాంట్రాక్టు క్రికెటర్లకు మాత్రం పూర్తి స్థాయిలో వేతనాలు అందాయి. ఇప్పుడు రంజీల్లో కూడా అదే పద్దతిని అనుసరించాలని సీనియర్ క్రికెటర్లు అడుగుతున్నారు. ఒక రాష్ట్ర పరిధిలో వందల మంది క్రికెటర్లు ఉంటారు. కానీ ఒక్కో జట్టుకు 30 మంది చొప్పున రెగ్యులర్ క్రికెటర్లకు కాంట్రాక్టు ఇస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదని సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ సూచిస్తున్నాడు. తన లాంటి వారికి మ్యాచ్‌లు లేకపోయినా.. ఐపీఎల్ లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు అందుతున్నది. కానీ సౌరాష్ట్ర జట్టులోనే అనేక మంది దేశవాళీ క్రికెట్‌పై ఆధారపడి ఉన్నారు. వాళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుందని అంటున్నాడు. అయితే బీసీసీఐ మాత్రం అంత మందికి కాంట్రాక్టు ఇవ్వడం కుదరదనే అంటున్నది. అలా చేయడం వల్ల ఆ క్రికెటర్లు అందరూ నేరుగా బీసీసీఐ పరిధిలోకి వస్తారని.. రాష్ట్రాల అసోసియేషన్లతో సంబంధం లేకుండా పోతుందని వాదిస్తున్నది. క్రికెటర్లు నష్టపోకుండా త్వరలోనే పరిహారం అందిస్తామని చెబుతున్నది.

Advertisement

Next Story