క్రియేటివ్ జీనియస్ మల్లేశం

by Sridhar Babu |   ( Updated:2020-04-17 00:00:25.0  )
క్రియేటివ్ జీనియస్ మల్లేశం
X

దిశ, కరీంనగర్:

రెండు దశాబ్దాల కిందట ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన మంచి ఉద్యోగంలో చేరారు. భార్యా పిల్లలను పెంచి పోషించేందుకు సరిపడా నెలనెలా జీతం వస్తోంది అని సంతోషంతో కాలం వెల్లదీయలేదు. నా చదువు ఇంత వరకేనా..? ఒకరి కింద పనిచేస్తూ ఉండటమేనా అన్న మనోవేదనతో బాధపడ్డాడు. యాంత్రిక జీవనం ఆయన్ను వెంటాడింది. అసలేం చేయాలి..ఎలా ముందుకు సాగాలి ? అని అంతర్మథనం చెందారు. మల్టినేషనల్ కంపెనీల్లో జీతం కోసం పనిచేస్తే ఏం లాభం .? ఉద్యోగం చేస్తూ ఏదో సాధించామని సంబరపడి పోవడం ఆయనకు నచ్చడం లేదు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎందుకు చేరలేకపోతున్నామన్న ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

తన స్వస్థలమైన సిరిసిల్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు మకాం మర్చారు. తన లక్ష్యం తానొక్కడినే యజమాని కావలని కాదు.. తెలంగాణ సమాజంలోని యువతలో మార్పు తీసుకరావాలి వారిని జీతం తీసుకునే వారిలా కాకుండా ఇచ్చే వారిలా తీర్చిదిద్దాలి. ఇదే లక్ష్యంతో దశాబ్ద కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయనే బుదారం మల్లేశం.

సెన్సార్ మల్లేశంగా బ్రాండ్ సంపాదించిన బుదారం మల్లేశం 1998లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొంతకాలం ఓ కంపెనీలో ఉద్యోగం చేశారు. జీతంతో పాటు ఉద్యోగం బాగుంది తనకింకా కావల్సిందేమీ లేదు అన్న భావనతో ఆగిపోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా కొత్తవి కనిపెట్టినప్పుడే కదా వారికి గుర్తింపు వస్తుంది. అదే బాటలో మన తెలంగాణ బిడ్డలు ముందుకు సాగడం లేదెందుకు అన్న ఆలోచనతో అటువంటి కార్యక్రమం తన నుంచే ప్రారంభం కావాలనుకున్నారు. అంతే అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి స్వగ్రామమైన సిరిసిల్లకు వచ్చేశారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు మకాం మార్చి తన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు దశాబ్ద కాలంగా తనలోకి క్రియేటివిటీకి పదునుపెడుతూనే యువత ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తనలోని ఆలోచనలకు గమ్యం కన్నా లక్ష్యం చేరడమే ముఖ్యమన్న భావనతో ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ సాగుతున్నారు.

ఐదు వేల ఆవిష్కరణలు..

5 వేలకు పైగా ఆవిష్కరణలు చేసిన మల్లేశం ఇప్పటికే 150 వస్తువులకు పెటెంట్ కూడా పొందారు. సెన్సార్ మల్లేశంగా బ్రాండ్ పడిపోయిన ఆయన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డు ఉంటేనే బైక్ స్టార్ట్ అయ్యే విధంగా సెన్సార్ కార్డు, మాట్లాడే చెత్తబుట్ట, మాట్లాడే చెట్లు ఇలా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. సాంకేతికంగా తాను మాత్రమే ముందుకు సాగితే సరిపోదని భావించిన ఆయన చాలామందిని తన లక్ష్యానికి అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నించారు. జీతం తీసుకునేందుకే మన చదువాలా..? జీతాలు ఇచ్చే స్థాయికి చేరడం లేదెందుకు..? అన్న నినాదంతో చాలామందిని మార్చే ప్రయత్నం చేశారు.

దాదాపు దశాబ్ద కాలంగా ఆయనకు తెలిసిన వారిని ఈ దిశగా మార్చే ప్రయత్నం చేశారు. అయినా చాలా మంది నుంచి స్పందన లేకుండా పోయింది. చాలామంది మావోడికి ఉద్యోగం వస్తే చాలనుకునే విధంగా పిల్లలను పెంచుతున్నారు. మల్టినేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికితే తాను భారీ టార్గెట్‌ను ఛేదించానన్న సంతోషంతో ముందుకు సాగుతున్న నేటి తరాన్ని మార్చడం ఆయనకు అంత సులువుగా సాధ్యపడలేదు. అయినా ఆయన మాత్రం తన పయనం మాత్రం అటుగానే సాగించారు. ఓ వైపున తనలోని క్రియేటివిటీకి పదును పెడుతూనే తన భార్య, పిల్లలను కూడా ఇదే ఆలోచనలతో ముందుకు సాగే విధంగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఆవిష్కరణలు చేశారు.

ఇప్పుడిప్పుడే సమాజంలో వస్తున్న మార్పులు, చదువుకు తగినట్టుగా ఉద్యోగం దొరకని పరిస్థితుల వల్ల టెక్నాలజిస్ట్ మల్లేశం క్లాస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. వారందరికీ ఉచితంగా అవగాహన కల్పిస్తున్న ఆయన ముందుగా చదువుకన్నా నేటి యువతలో క్రియేటివిటీ ఆలోచనలు పెంచాలన్న సంకల్పంతో క్లాస్‌లు చెప్తున్నారు. 30 మందికి రోజూ ఉచిత క్లాసులు ఇస్తున్న మల్లేశం తన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ వెళ్లేవారిని యజమానులుగా చూడాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నారు.

తన భార్యతో పాటు ఇద్దరు కూతుర్లను కూడా అదే బాటలో నడిపించారు. వారు పలు సాంకేతిక పరికరాలను తయారు చేశారు. తాజాగా ఆయన చిన్న కూతురు స్నేహ కరోనా నివారణకు తనవంతు ప్రయత్నంగా బజర్ వాచ్ తయారు చేశారు. బీఎస్సీ ఫస్టీయక్ చదువుతున్న స్నేహా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న విషయాలను గమనించి అందుకు తగ్గట్టుగా వాచ్ తయారు చేశారు. తన తండ్రి సహకారంతో బజర్ వాచ్‌ను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం కనిపించే విధంగా తయారు చేశారు.

రిస్ట్ వాచ్‌లా ఉండే ఈ ఎక్విప్ మెంట్‌ను పెట్టుకుని బటన్ ఆన్ చేయాలి. చాలా మంది తమ చేతులతో తరుచూ ముఖాన్ని తుడుముకోవడం, కళ్లను నలుపుకోవడం చేస్తుంటారు. అప్పటికే చేతి వేళ్లపై కరోనా వైరస్ పడి ఉంటే వెంటనే ఇలా చేసే వారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. దీనికి ప్రత్యామ్నాయంగా బజర్ వాచ్ చేతులు కడుక్కోకుండా ముఖం వద్దకు తీసుకెళ్లగానే సైరన్ ఇస్తుంది. దీంతో వారు తాము చేతులు కడుక్కొవాలని గుర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల తెలియకుండా కరోనా వైరస్ బారిన పడకుండా నిలువరించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు స్నేహ. సామాజిక దూరం కూడా ఇప్పుడు అత్యంత ప్రాధాన్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉన్నప్పుడు తమవద్ద ఉన్న అలర్ట్ వాచ్ అప్రమత్తం చేసే విధంగా మరో వాచ్‌ను కూడా తయారు చేసే పనిలో నిమగ్నం అయింది.

నాన్నే నాకు ఆదర్శం

ఎన్నో అద్భుతాలను తయారు చేసే నాన్నే నాకు ఆదర్శం. చదువుతో పాటు సాంకేతిక పరికరాలను తయారు చేసేందుకు నా వంతుగా ప్రయత్నిస్తున్నాను ఇందుకు తగ్గట్టుగానే నాన్న నన్ను వెన్నుతట్టి ప్రొత్సహించడంతో పాటు సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు సహకరిస్తుంటారు. నాన్న ఎన్నో రకాలా పరికరాలను తయారు చేశారు.
-స్నేహ

నేటి తరం క్రియేటివిటితో సాగాలి..

నేను ఒక్కడినే క్రియేటివిటీతో ముందుకు సాగడం కాదు సమాజంలోని నేటి తరం కూడా ఇలాగే ఉండాలన్నదే నా తపన. అందులో భాగంగానే ఎల్ ఈడీ బల్బులు తయారు చేసి నింపాదిగా జీవనం సాగించేందుకు ఓ యువకుడిని తీర్చిదిద్దా. ఎంసీఏ చేసిన మరో యవకుడు ఉద్యోగ వేటలో ఉంటూ నావద్దకు వచ్చాడు. వెబ్ డిజైనింగ్ సబ్జెక్ట్ పై పట్టు సాధించు నీ కాళ్లపై నిలబడతావని చెప్పి ఆ దిశగా తీర్చిదిద్దా. అతనిప్పుడు కొన్ని వ్యాపార సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రధానంగా తెలంగాణ సమజాంలోని చాలా మందిలో క్రియేటివిటీ ఉన్నా ఆ దిశగా ముందుకు సాగడం లేదు. అదే నా మనసును బాధిస్తోంది. ఇక్కడి వారికి నేచురల్‌గా క్రియేటివిటీ ఉంటుంది అలాంటి వారి లోపలి మనిషిని తట్టి లేపాలన్నదే నా లక్ష్యం. అదే బాటలో ముందుకు సాగుతా.. ఔత్సాహికులు నా వద్దకు వస్తే ఉచితంగానే శిక్షణ ఇస్తాను.

-బుదారం మల్లేశం

Tags: Entrepreneur, Creative Expert, Mallesham, free training, youth, karimnagar

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed