కరకట్ట రక్షణకు కదిలిరండి !

by srinivas |   ( Updated:2020-11-01 10:35:37.0  )
కరకట్ట రక్షణకు కదిలిరండి !
X

దిశ, ఏపీ బ్యూరో: కరకట్ట ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, 2,500 ఇళ్లను తొలగించడానికి వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఎం నేత సీహెచ్ ​బాబూరావు విమర్శించారు. ఆదివారం కరకట్ట రక్షణ కోసం కదిలి రావాలని పిలుపునిస్తూ సీపీఎం పాదయాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ గతంలో ఇళ్లు తొలగించకుండా రక్షణ గోడని కొంతభాగం నిర్మించినట్లు తెలిపారు. నేడు రక్షణ గోడ నిర్మాణం పేరుతో పేదల ఇళ్లను తొలగించడం సరికాదన్నారు. వరదలు, తుపాన్లు, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు. గతేడాది నుంచి ఇప్పటికి పలుమార్లు వరదలకు నష్టపోయినా ప్రభుత్వం కనీస సాయం కూడా చేయలేదని తెలిపారు.

అటు.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం ప్రజా చైతన్య భేరిని ప్రారంభించిన సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎంత ఘనంగా జరిపామన్నది ముఖ్యం కాదన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన రాజీ పడ్డాయని విమర్శించారు. ప్రత్యేక హోదాకు ఎసరు పెట్టి రాజధానికి నిధులు ఇవ్వకుండా చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టితో ప్రధాని మోడీ మోసం చేశారన్నారు.

Advertisement

Next Story