బొగ్గు బ్లాకులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోవద్దు !

by Shyam |   ( Updated:2020-05-27 07:02:30.0  )
బొగ్గు బ్లాకులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోవద్దు !
X

దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి పోకుండా కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రాంతంలో 1943లో నిజాం పరిపాలనలోనే సింగరేణి కాలరీస్ సంస్థ స్థాపించబడిందని గుర్తుచేశారు. ఈ సంస్థ రాష్ట్రంలో కొత్తగూడెం, గోదావరిఖని, మందమర్రి , శ్రీరాంపూర్, బెల్లంపల్లి , భూపాలపల్లి ప్రాంతాల్లో విస్తరించి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని గుర్తుచేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా కాంట్రాక్టర్లకు రూ.1000 కోట్లు రుణాలు ఇస్తూ, 50బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను సీపీఐ వ్యతిరేకిస్తుందన్నారు. సింగరేణిలో ఇప్పటికే 28అండర్ గ్రౌండ్‌మైన్స్, 19ఓపెన్ కాస్టులలో నుంచి తీస్తున్న బొగ్గుతో గత ఏడాది రూ.1700కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థల చేతుల్లోకి పోకుండా ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు.

Advertisement

Next Story

Most Viewed