పోడు రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షసత్వం : సీపీఐ

by Sridhar Babu |   ( Updated:2021-08-29 04:14:12.0  )
CPI leader Sabir Pasha
X

దిశ, గుండాల: పోడు సాగుదారుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుండాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోడు భూమల రక్షణ కోసం ఇతర పార్టీలను కలుపుకొని బలమైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం బలవంతంగా హరితహారం పేరుతో ఇప్పటివరకు రెండు లక్షల ఎకరాలు లాక్కున్నారని మండిపడ్డారు. కొనిజర్ల మండలంలోని రామనర్సయ్య నగర్‌ మహిళలపై దుర్భాషలాడి, దాడి చేశారని ఆరోపించారు.

ఫారెస్ట్ అధికారుల దాడిలో ఇప్పటికే నలుగురు పోడు రైతులు మరణించారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, కుర్చీ వేసుకుని కూర్చొని పోడు రైతుల సమస్యలు పరిష్కరించి, పట్టాలు ఇప్పిస్తానని మాట ఇచ్చి విస్మరించారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ప్రాజెక్టుల పేరిట ఐదు లక్షల ఎకరాల భూములు ప్రజల నుంచి లాక్కున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ నేతలు రమేష్, రేసు ఎల్లయ్య, కృష్ణ, గడ్డం శీను, కోటేశ్వరరావు, సనప కృష్ణకాంతారావు, మల్లయ్య, రహీం, బచ్చలి లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed