నిందలు వేసుకోవడం మాని రైతులకు న్యాయం చేయండి : CPI

by Shyam |
CPI leader Palla Venkat Reddy
X

దిశ, తిరుమలగిరి: రైతులు వరిపంట వేసుకోవద్దని చెప్పే ప్రభుత్వాలు రైతులకు ఆరు నెలల పాటు వేతనాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో సీపీఐ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. యాసంగి వరిపంట వేసుకోవద్దని రాష్ట్రప్రభుత్వం చెబుతోందని, కానీ, వానాకాలం పంట అమ్ముకోవటానికే రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు.

ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు మరింత నష్టపోకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తుగానే ప్రభుత్వం ఏ పంటకు ఎంత ధర చెల్లిస్తుందో చెబితే, రైతులు వారికి నచ్చిన పంట వేసుకునే వారని అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేసిందని కుండబద్దలు కొట్టారు. ఈ సమావేశంలో చంద్రశేఖర్, మల్లేశ్వరి, వెంకటేశ్వర్లు, దామోదర్ రెడ్డి, చంద్రయ్య, లక్ష్మయ్య, లక్ష్మినరసయ్య, యాదగిరి, సోమిరెడ్డి, ప్రభాకర్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story