కొవిషీల్డ్ ధర రూ.1000

by sudharani |
కొవిషీల్డ్ ధర రూ.1000
X

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ప్రైవేట్ మార్కెట్‌లో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను విక్రయించడానికి సిద్ధమనేనని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధర్ పూనావాలా తెలిపారు. వాణిజ్యపరంగా డోసు ఒక్కటి రూ.1000లకు విక్రయించడానికి అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌కు డీజీసీఐ అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీరం సీఈఓ అధర్ పూనావాలా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కోసం ప్రత్యేకంగా డోసుకు రూ.200చొప్పున 10 కోట్ల డోసులను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఒక్కసారి టెండర్లు పూర్తయితే రకరకాల ధరలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఏదిఏమైనా మేం ప్రభుత్వానికి ఇస్తున్న టీకాలను దేశంలో ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు.

ఆ తర్వాత ప్రైవేట్ మార్కెట్‌లో టీకాలను విక్రయించనున్నామని, డోసు ఒక్కటి రూ.1000లకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్‌కు మరో బూస్టర్ అవసరం కాబట్టి, వ్యాక్సినేషన్‌కు రూ.2000 ఖర్చవుతుందని స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మాదిగ్గజం ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే రిస్క్ తీసుకొని సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం ఆ సంస్థ దగ్గర ఐదు కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడు నుంచి 10 రోజుల్లో ఫార్మాలటీలన్నీ పూర్తవుతాయని భావిస్తున్నామని, ఆ తర్వాత వెంటనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని అధర్ పూనావాలా తెలిపారు. వచ్చే నెల నుంచి నెలకు 7 కోట్ల నుంచి 8 కోట్ల డోసులకు ఉత్పత్తి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, సూచనల ప్రకారం పనిచేస్తున్నామని, ప్రస్తుతానికి ప్రైవేటు మార్కెట్‌లో విక్రయించడం లేదా ఎగుమతి చేయకూడదని ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, ఎందుకంటే దుర్బలమైన ప్రజలకు టీకా అందజేయాలని భావిస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed