కొవిడ్ లిస్టులో కొత్త లక్షణాలు

by sudharani |   ( Updated:2021-01-16 05:11:46.0  )
కొవిడ్ లిస్టులో కొత్త లక్షణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు కొవిడ్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా లక్షణాల లిస్టులో కొత్తగా మరొక లక్షణం చేరడం గమనార్హం. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కఫం, కండరాల నొప్పి, ముక్కు కారడం, గొంతుమంట, విరేచనాలు, వాసన లేమి, రుచి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి. తాజాగా నోరు, నాలుకపై తెల్లమచ్చలున్నా.. అది కొవిడ్ లక్షణమేనని తేలింది.

లండన్ కింగ్ కాలేజీ ప్రొఫెసర్, ఎపిడెమియాలజిస్ట్, శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి ఆయన ‘COVID Tongue’ అని పేరు పెట్టారు. ZOE Covid Symptom స్టడీ యాప్ ద్వారా కరోనా లక్షణాలు కలిగిన వారి వివరాలను సేకరించిన ప్రొఫెసర్.. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్ల మంది కరోనా బాధితుల డేటాను విశ్లేషించారు. అనంతరం కరోనాకు సంబంధించిన ఈ కొత్త లక్షణాన్ని కనుగొన్నారు. ఇంగ్లాండ్‌లో కరోనా అధికారిక లక్షణాల జాబితాలో ఈ కొవిడ్ టంగ్ అనే లక్షణం లేదని స్పెక్టర్ వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).. కరోనా నోటి లక్షణాల జాబితాలో ఈ లక్షణాన్ని చేర్చలేదని చెప్పిన స్పెక్టర్.. నోరు, నాలుకపై ఇలాంటి అసాధారణమైన తెల్లటి మచ్చలు కనిపిస్తే.. అది కరోనా అయుండొచ్చునని హెచ్చరిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అలాంటి వారు వెంటనే సెల్ఫ్ ఐసోలేట్ కావాలని సూచిస్తున్నారు. కొంతమందిలో ఈ లక్షణంతో పాటు తలనొప్పి, అలసటగా అనిపిస్తుందని వివరించారు.

Advertisement

Next Story