కొవిడ్ సెంటర్ల వద్ద కోటి కష్టాలు..

by Sridhar Babu |   ( Updated:2021-05-19 11:37:23.0  )
కొవిడ్ సెంటర్ల వద్ద కోటి కష్టాలు..
X

దిశ, పెద్దపల్లి : కరోనా మహమ్మారి సోకిన వారు ఓ రకంగా అవస్థల పాలవుతుంటే… వారి కోసం అటెండెంట్లు తల్లడిల్లిపోతున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందంటే చాలు బాధితులు ఐసోలేషన్ సెంటర్లలో చేరిపోతున్నారు. ఈ క్రమంలో కోవిడ్ కేర్ సెంటర్ల లోపల ఉన్న వారి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, అత్యవసర సేవలు అందించేందుకు వారి బంధువులు అష్టకష్టాలు పడుతున్నారు. మహమ్మారి కరోనా సోకిన వారినే కాదు వారి బంధువులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.

పెద్దపల్లి జిల్లా సుల్దానాబాద్ లోని కోవిడ్ కేర్ సెంటర్ వద్ద పడిగాపులు పడుతున్న బాధితుల బంధువుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ’దిశ‘ స్పెషల్ విజిట్ చేసింది. బుధవారం రాత్రి 9.50 నిమిషాల ప్రాంతంలో కోవిడ్ కేర్ సెంటర్ వద్ద అటెండెంట్లు పడుతున్న బాధలను చిత్రీకరించింది. ఈ నేపథ్యంలో లోపల ఉన్న తమ వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళనతో పాటు వసతి లేకపోవడంతో ఆరు బయటే వారంతా రెస్ట్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేర్ సెంటర్ ముందే ఖాళీ స్థలంలో కునుకు తీస్తున్న వారు కొందరైతే చిన్నారులతో సహ వచ్చి తమవారి ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళనతో ఎదురు చూస్తున్న వారు మరికొందరు. వేసవి తాపంతో పొద్దంతా అక్కడే ఎదురు చూసిచూసి చీకటి కాగానే అక్కడే నిద్రిస్తున్నారు. తమ వారు ఎప్పుడు బయటకు వస్తారోనన్న ఆతృతతో పగలు రాత్రి కేర్ సెంటర్ వద్దే పడిగాపులు కాస్తున్న వారి పరిస్థితి మరీ దారుణమనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed