15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో కరోనాకు కళ్లెం : కేంద్రం

by Shamantha N |   ( Updated:2020-04-13 10:59:23.0  )
15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో కరోనాకు కళ్లెం : కేంద్రం
X

న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆశాజనకమైన కబురు చెప్పింది. 25రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో ఇప్పటికే గుర్తించిన కరోనా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా కళ్లెం వేయగలిగిందని వివరించింది. గత 14 రోజుల్లో ఆ జిల్లాల నుంచి కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించింది. కరోనా పరీక్షల కోసం కావాల్సిన పరికరాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వచ్చే ఆరువారాల పాటు కరోనా పరీక్షలకు అవసరమైన స్టాక్ ఉన్నదని పేర్కొంది. అంతేకాదు, ఇప్పటివరకు సుమారు రెండు లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్టు వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లవ్ అగర్వాల్ సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా కేసులు వివరాలు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు వెలుగుచూసినట్టు తెలిపారు. అలాగే, 35 మంది మరణించినట్టు చెప్పారు. 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గతంలో వెలుగుచూసిన కరోనావైరస్ కేసులు శూన్యమయ్యాయని వివరించారు. 14 రోజులుగా ఆ జిల్లాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. ఇదొక ఆశాజనకమైన పరిణామమని పేర్కొన్నారు. లవ్ అగర్వాల్ ప్రకటించినవాటిలో 20 జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

1. భద్రాద్రతి కొత్తగూడెం, తెలంగాణ
2. గోండియా, మహారాష్ట్ర
3. రాజ్‌నంద్ గావ్, ఛత్తీస్‌గడ్
4. దావంగిరి, కర్ణాటక
5. దక్షిణ గోవా
6. వయానాడ్, కేరళ
7. కొట్టాయం, కేరళ
8. పశ్చిమ ఇంఫాల్, మణిపూర్
9. రాజౌరీ, జమ్ము కశ్మీర్
10. మాహె, పుదుచ్చేరి
11. ఎస్‌బీఎస్ నగర్, పంజాబ్
12. పాట్నా, బీహార్
13. నలందా, బీహార్
14. ముంగేర్, బీహార్
15. ప్రతాప్‌గడ్, రాజస్తాన్
16. పానిపట్, హర్యానా
17. రోహతక్, హర్యానా
18. సిర్సా హర్యానా
19. పౌరి గర్హవాల్, ఉత్తరాఖండ్
20. ఐజ్వల్ వెస్ట్, మిజోరం

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,06,212 కొవిడ్ 19 టెస్టులు జరిపినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. కాగా, ఆదివారం 14,855 టెస్టులు 156 ప్రభుత్వ ఆస్పత్రుల ల్యాబ్స్‌లో జరిగాయని, 1,913 టెస్టులు ప్రైవేటు ల్యాబుల్లో జరిగాయని వివరించింది. ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదనీ, మరో ఆరువారాలకు టెస్టులకు సరిపడా స్టాక్ ఉన్నదని తెలిపింది.

27 రాష్ట్రాల్లోని 78వేల స్వయం సేవక సంఘాలు 1.96 లక్షల మాస్కులను తయారు చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ కింద ఏప్రిల్ 10వ తేదీనాటికి 30వేల మంది పేద ప్రజలకు రూ. 28,256 కోట్ల ఆర్థిక సహకారాన్ని అందించినట్టు తెలిపింది. పీఎం కిసాన్ యోజన కింద.. 6.93 మంది రైతులకు 13,855 కోట్ల ఆర్థిక సహయాన్ని అందించినట్టు వివరించింది.

Tags: lockdown, health ministry, cases, containment, districts

Advertisement

Next Story