కొవిడ్ సహాయక చర్యలు కొనసాగించనున్న హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్

by Harish |
కొవిడ్ సహాయక చర్యలు కొనసాగించనున్న హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ మార్టిగేజ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఈ ఏడాది కరోనా సహాయక చర్యలను మరో 2 త్రైమాసికాలు పెంచనున్నట్టు తెలిపింది. కొవిడ్ సహయక చర్యల్లో భాగంగా ఈ ఏడాది రూ. 40 కోట్లను కేటాయించిన సంస్థ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాబోయే మరో రెండు త్రైమాసికాల పాటు ఈ మొత్తాన్ని పెంచడమే కాకుండా వివిధ కార్యక్రమాలను కొనసాగించనున్నట్టు వెల్లడించింది. ఈ సహాయక చర్యలన్నీ దాతృత్వ సంస్థ హెచ్‌టీ పరేఖ్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వ, స్వచ్ఛంద ఆసుపత్రులతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు అందించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు సంస్థ పేర్కొంది. దేశంలో పలు ప్రాంతాల్లో ఆసుపత్రులలో తీవ్రంగా కరోనా బారిన పడిన వారికి అవసరమైన ఐసీయూ వెంటిలెటర్లను కంపెనీయే సేకరించి పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా వైద్యానికి అవసరమైన ఆక్సిజన్ డిమాండ్‌ను తీర్చేందుకు కొత్తగా 10 ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ‘ఆరోగ్య సంరక్షణ తక్షణ అవసరాలను గుర్తించడం క్లిష్టమైన విషయం, జీవనోపాధికి తోడ్పడే దీర్ఘకాలిక నిర్ణయాలు, దేశంలో మరింత మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను నిర్మించాలని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed