ప్రతి సోమవారం కొవిడ్ 19 కేసుల్లో తగ్గుదల.. ఎందుకిలా?

గత మూడు నాలుగు నెలలుగా కొవిడ్ 19 పాజిటివ్ కేసులు ఎన్ని అనే విషయం తెలుసుకోకపోతే ఎవరికీ నిద్రపట్టట్లేదు. అవి పెరిగిన రోజు వామ్మో అనుకుని, మళ్లీ తగ్గిన రోజు హమ్మయ్య అనుకోవడం దినచర్యలో భాగంగా మారింది. అయితే కొవిడ్ 19 కేసుల పాజిటివ్ సంఖ్యలో ఒక ప్యాటర్న్ ఉంది. ఒక వారంలో మిగతా రోజులతో పోలిస్తే సోమవారం రోజున కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. గత 10 వారాల నుంచి ఇదే ప్యాటర్న్ కనిపిస్తోంది. జులై 6వ తేదీ సోమవారం రోజున భారతదేశంలో 22,007 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దానికి ముందు జులై 5వ తేదీన అంటే ఆదివారం రోజున 24,976 కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల మధ్య 2900 కంటే ఎక్కువ తేడా ఉంది. ఎందుకిలా?

శని, ఆది వారాల్లో వైరస్ యాక్టివ్‌గా లేకపోవడం, గ్రహాల కూటమి సరిగా లేకపోవడం.. ఇలా సంప్రదాయ భావనలు ఊహించకండి. ఇలా సోమవారం రోజున తక్కువ కేసులు నమోదవడానికి కారణం ఆదివారం రోజున టెస్టులు తక్కువ చేయడమే. అవును.. టెస్టులు చేసే వారికి కూడా విశ్రాంతి కావాలి కదా! వారం మొత్తం టెస్టులు చేసి, చివరికి సండే రోజు కూడా శాంపిళ్లు పట్టుకుని, పరీక్ష నాళికల్లో వేసి, రిపోర్టులు రాయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఆదివారం రోజున టెస్టులు తక్కువ చేస్తారు. కాబట్టి సోమవారం రోజున పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతాయి. లాక్‌డౌన్ ఉంటే వైరస్ తీవ్రంగా ఉందని, సడలింపులు చేస్తుంటే వైరస్ తగ్గిపోయిందని భావించడం ఎంత మూర్ఖత్వమో కేసుల సంఖ్య తగ్గినపుడు కరోనా తగ్గిందనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. కాబట్టి వీలైనంత మేరకు ఇంట్లో ఉండే పనులు చక్కబెట్టుకునేందుకు ప్రయత్నించండి. అన్‌లాక్ 3 వచ్చేసింది కదా అని మీ ఇల్లు అన్‌లాక్ చేసి బయటికి వస్తే కరోనా మిమ్మల్ని లాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త!

Advertisement