ఈటలకు కొత్త టెన్షన్.. సమాచారమంతా లీక్

by  |   ( Updated:2021-05-14 04:53:38.0  )
former minister Etela Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి ఈటల రాజేందర్​చుట్టూ ఇంటి దొంగలు తయారయ్యారని, ఆయన వర్గీయుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. అందుకే ఏ చిన్న సమాచారమైనా, ఈటలను కలిసేందుకు వచ్చే నేతలైనా, ఆయనతో టచ్‌లో ఉంటున్న వారి వివరాలు ఈటల కంటే ముందుగానే గోడలు దాటుతున్నాయి. ఈటలకు సంబంధించిన అంతరంగిక విషయాలన్నీ ఆయన దగ్గర పనిచేసే వారే బయటకు లీక్ చేస్తున్నారని, ప్రత్యర్థులకు ఉప్పందిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే కొంతమంది గురించి ఇప్పటికే ఈటల అనుచరులు ఆయన చెవిలో వేశారు. ముందునుంచీ ఉంటున్న వారే కావడంతో ఎవరిని అనుమానించాలనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం భూముల వ్యవహారం, దానికి సంబంధించిన పత్రాలు, రాజకీయపరమైన అంశాలను అటు సర్కారుతో పాటుగా కొంతమంది సొంతపార్టీలోని ప్రత్యర్థులు, ఆయన వ్యతిరేకులకు అందిస్తూ ఆయన దగ్గరే విశ్వసనీయంగా పనిచేస్తున్నట్లు నటిస్తున్నట్లు సమాచారం. ఎంతో నమ్మకంగా అనునిత్యం వెంటే ఉండేవారే కోవర్టులుగా మారి ఆయన వ్యాపార లావాదేవీలు అన్నింటినీ ప్రత్యర్థులకు అందిస్తున్నారని టాక్. దీనిపై కొన్ని విషయాలను ఉదాహరణగా చెబుతూ కొంతమంది ధైర్యం చేసి ఈటలకు వివరించినట్లు కూడా సమాచారం. అయితే మంత్రిగా ఉన్నప్పుడు అంతగా దృష్టి పెట్టని ఆయన, ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరినీ అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ముందునుంచీ ఉంటున్నవారే కావడంతో ఎవరిని.. ఎలా దూరం పెట్టాలనే మీమాంస కొనసాగుతోంది.

భూముల వివరాలు లీక్!

ఈటల రాజేందర్, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి వ్యాపార లావాదేవీలు, భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రత్యర్థులకు అందించారని అనుమానాలున్నాయి. అంతేకాకుండా ఎక్కడ, ఎంత కొనుగోలు చేశాడు, ఎవరి పేరుమీద ఉంది, ఇతరుల పేరుతో కొనుగోలు చేస్తున్నారా, ఎక్కడ రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారుల సాయంపై వెంట వెంటనే సమాచారం బయటకు లీక్ చేయడంలో ఆయన చుట్టూ ఉండేవారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంట భూమి కొనుగోలు చేసినా అవి డాక్యుమెంట్లు రాకముందే ముందే బయటకు సమాచారం చేరవేస్తుండటంతో ఆ అజ్ఞాత వాసి ఎవరా అని తల పట్టుకుంటున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్​నేతకు లీకులు?

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ భూకబ్జా అక్రమాలపై పూర్తిస్థాయిలో ప్రెస్‌మీట్‌లు పెట్టి పూర్తి వివరాలు మీడియాకు వివరిస్తున్నారు. అయితే ఇలాంటి పూర్తిస్థాయి వివరాలు ఈటల రాజేందర్ ఇంటి నుంచే సదరు నేతకు అందినట్లు సమాచారం. కరీంనగర్ వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఆయన భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ నేత అంత బహిరంగంగా మీడియా ముందు వెల్లడించారంటున్నారు. భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు, గ్రామాల వివరాలను ప్రత్యర్థులకు అందిస్తూ ఈటలను నమ్మించి మోసం చేయడమే కాకుండా గిఫ్ట్‌గా లక్షల రూపాయలను తీసుకుంటున్న అనుచరులను ఆయన గుర్తించలేక పోయారని ఆయన వర్గీయుల చెబుతున్నారు. మెదక్ జిల్లాలోని అసైన్‌మెంట్ భూముల వ్యవహారంపై, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలను సొంత పార్టీ నేతలతో పాటుగా కాంగ్రెస్ నేతలకు అందించినట్లు ప్రచారం.

ఈ నేపథ్యంలోనే ఈటలపై మూకుమ్మడి దాడి జరుగుతుందని, ఇలాంటి సమయంలో తన ఇంటి నుంచే చాలా వివరాలు లీక్ అవుతున్నాయని ఆయన కుటుంబసభ్యులు తాజాగా పసిగట్టినట్లు తెలుస్తోంది. ఈటల దగ్గర మొదట్నుంచీ పనిచేస్తున్న ఇద్దరు, ముగ్గురిపై అవినీతి, అక్రమాలు చేస్తున్నారని, ఆయన దగ్గరకు వచ్చే వారిని కూడా ఇబ్బందులకు గురి చేసిన సంఘటలున్నాయనీ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed