పెండ్లి చేసుకునేందుకు ఆర్యసమాజ్‌కు.. ప్రేమజంట కిడ్నాప్

by Shyam |   ( Updated:2021-08-05 08:07:15.0  )
పెండ్లి చేసుకునేందుకు ఆర్యసమాజ్‌కు.. ప్రేమజంట కిడ్నాప్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకునేందుకు నగరానికి వచ్చిన జంట సినిమా ఫక్కీలో కిడ్నాప్‌కు గురైన సంఘటన గురువారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. కిడ్నాప్ సందర్భంగా వారిపై దాడి చేసి కారులో ఎక్కించుకుని పారిపోయారు. దీంతో వారి వివాహం జరిపించేందుకు వచ్చిన స్నేహితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా మద్ధూర్ మండలం బండగొండ గ్రామానికి చెందిన శివశంకర్ (23), అదే జిల్లా నిర్జింత గ్రామానికి చెందిన హర్షిత రెడ్డి (21)లు కాలేజ్ లో చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు.

వీరిద్దరి కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాలు ప్రేమ వివాహానికి అభ్యంతరం చెప్పాయి. దీంతో వారు ఇంటి నుండి పారిపోయి బడీచౌడీలోని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకునేందుకు నగరానికి వచ్చారు. అంతేకాకుండా పెండ్లికి సాక్షులుగా బీహెచ్ఈల్ లో ఉంటున్న స్నేహితులను కూడా పిలిపించుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో వారు ఆర్యసమాజ్ కు చేరుకుని లోనికి వెళ్తుండగా ఎర్టిగా కారులో వచ్చిన కొంత మంది శివశంకర్ పై దాడి చేశారు. అనంతరం ప్రేమ జంటను కారులో ఎక్కించుకుని అక్కడినుండి పారిపోయారు. దీంతో వారి స్నేహితులు రణదీర్ తదితరులు కూత వేటు దూరంలోనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజీల ఆధారంగా దాడి చేసి కిడ్నాప్ కు పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed