నిధులు గుటుక్కు.. నార్సింగి కౌన్సిలర్ల అవినీతి

by Shyam |
Narsingi municiple office
X

దిశ, తెలంగాణ బ్యూరో: జేబులు నింపుకునేందుకు కౌన్సిలర్లు పన్నిన పన్నాగం నగదు పంపిణీలో తేడాలు రావడంతో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ బాగోతమంతా తిలకించిన, ఆలకించిన జనాలు మాత్రం ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటివారినా గెలిపించిందంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న నార్సింగి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న అవినీతి దందా ఇది. ఇంత జరిగినా అధికారులు మాత్రం తమకేం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.

అసలేం జరిగింది

గతేడాది మార్చి, ఏప్రిల్ లో నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని పాలక మండలి తీర్మానించింది. నీరు సరఫరా చేయకుండానే ఆ రెండు నెలలలోనే రూ.51,45,704 ఖర్చు చేసినట్లు చూపించారు. ముగ్గురు సివిల్ ​కాంట్రాక్టర్ల పేరిట వేర్వేరుగా నిధులను విడుదల చేశారు. వారికి ట్యాంకర్లే లేవని తెలిసింది. వారు డ్రైనేజీ, సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి వంటి పనులు మాత్రమే చేస్తారు. నీటి బిల్లులకు సంబంధించిన చెక్కులను కూడా వారి పేరిటే జారీ చేశారు. వారు నగదుగా డ్రా చేసి కొందరు కౌన్సిలర్ల ఇంటికే వెళ్లి పంపిణీ చేసినట్లు వాయిస్ ​రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చింది. కొందరు ఆ కాంట్రాక్టర్లకు ఫోన్​చేయగా నిధుల గోల్​మాల్​ విషయాన్ని అంగీకరించారు. డ్రా చేసిన నగదును నలుగురు కౌన్సిలర్లకు ఇచ్చినట్లు కాంట్రాక్టర్లు ఒప్పుకున్నట్లు వాయిస్ ​రికార్డులో స్పష్టమైంది. ఈ మాటలన్నీ నార్సింగిలో సోషల్​మీడియా ద్వారా హల్​చల్​చేస్తున్నాయి. రూ.కోట్ల విలువైన ఆస్తులున్న నాయకులు నీటి బిల్లుల విషయంలోనూ కక్కుర్తి పడుతున్నారని జనం మండిపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఎవరికి వారు తమ హయాంలో జరిగిన విషయం కాదంటూ దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని తెలిసింది. ఆ కాంట్రాక్టర్లకు ట్యాంకర్లు ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని విచారిస్తే అక్రమార్కుల బండారం వెలుగులోకి వస్తుందని ప్రజలు సూచిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎన్నేసి ట్రిప్పుల నీళ్లు సప్లయి చేశారో కూడా క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తే అవినీతిలో ఎవరెవరు ఉన్నారో వెల్లడవుతుందంటున్నారు.

అక్రమాలకు మద్దతు

నీటి బిల్లుల గోల్​మాల్​ద్వారా వాటాలు పంచుకున్న కౌన్సిలర్లు వారి ప్రాంతంలో జరిగే అక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఎత్తయిన భవనాలు కడుతుంటే చర్యలు తీసుకునే అధికారులపైనే మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన మున్సిపాలిటీ, ఏరియాగా పేరున్నప్పటికీ ఆదాయం మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story