మీకు కనికరం లేదా.. ఫీ‘జులుం’ ఏందీ..?

by Shyam |   ( Updated:2020-08-03 22:01:47.0  )
మీకు కనికరం లేదా.. ఫీ‘జులుం’ ఏందీ..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా కాలంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల దందా. ఆపత్కాలం లేదు.. కనికరం లేదు. కావాల్సిందల్లా కాసులు. పిల్లల భవిష్యత్ కాబట్టి తల్లిదండ్రులు ఎంతైనా వెచ్చిస్తారనే ఆలోచన యాజమాన్యాలకు కనక వర్షం కురిపిస్తున్నది. మేం అడిగినంత చెల్లించాల్సిందేనంటూ ఆర్డర్​ వేస్తున్నారు. ఫీజులకు.. పుస్తకాలకు మెలిక వెస్తున్నారు. ఆన్​లైన్​ క్లాస్​ల లింక్​ తీసేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ముక్కు పిండి నిర్ణయించిన ఫీజును నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటున్నారు. ​

కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై నేరుగా చూపుతోంది. కొవిడ్​ ప్రభావంతో స్కూళ్లు గత విద్యా సంవత్సరం పరీక్షలు రాక ముందే మూత పడగా నేటికీ తెరచుకోలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరికీ తెలియదు. దీంతో 2020-21 విద్యా సంవత్సరంలో పిల్లల చదువు అగమ్యగోచరంగా తయారైంది. ఇదిలా ఉంటే నగరంలోని చాలా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు ఆన్ లైన్ లో బోధన చేస్తున్నాయి. దీనికి తోడు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వం నిర్ధేశించిన పాఠ్య పుస్తకాలు కాకుండా సొంతంగా రూపొందించిన పుస్తకాల ఆధారంగా బోధన చేస్తున్నాయి. ఇవి కేవలం పాఠశాలల్లోనే అందుబాటులో ఉండడంతో ఫీజు బకాయిలకు పుస్తకాలకు లింకు పెడుతున్నారు. ఫీజు చెల్లిస్తేనే పుస్తకాలు ఇస్తున్నారు. మరికొన్ని పాఠశాలలో నోటు పుస్తకాలను సైతం తమ వద్దే కొనాలని ఆర్డర్​ వేస్తున్నాయి. ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తుండగా పుస్తకాలు లేకుండా చదువు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ఫీజుకు, పుస్తకాలకు లింకు పెట్టి ఫీజు చెల్లించడం తప్పనిసరి చేస్తూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.

పిల్లల భవిష్యత్​ విషయం కావడంతో తల్లిదండ్రులు అప్పు చేసైనా ఫీజులు చెల్లించి పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్ లో అందుబాటులో ఉండే నోటు పుస్తకాల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ యాజమాన్యాలు పాఠశాల పేర్లతో నోటు పుస్తకాలు తయారు చేయించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా జిల్లా విద్యా శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫీజులకు, పుస్తకాలకు లింకు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల దుస్థితి..

ప్రైవేట్ పాఠశాలల్లో పరిస్థతి ఇలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వేతనాలు అందకున్నా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రతి నెలా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కార్​ వేతనాలు చెల్లిస్తూనే ఉంది. అయితే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలన్నా వీలు కాని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా వరకు పేద వారే కావడం, వారి వద్ద వీడియో పాఠాలు వినేందుకు స్మార్ట్​ ఫోన్లు లేకపోవడంతో వారికి ఆన్ లైన్ తరగతులు నిర్వహణ సాధ్యం కాకుండా ఉంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరిన్ని రోజులు పాఠశాలల మూసి ఉండే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story